
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌లు ఆదివారం ఢిల్లీలో సమావేశమయ్యారు. చాణక్యపురిలోని బంగ్లా భవన్‌కు చేరుకున్న పటేల్.. మమతతో విపక్ష పార్టీల ఏకీకరణపై చర్చించారని తృణమూల్ వర్గాలు వెల్లడించాయి. ‘వీరిద్దరి భేటీకి చాలా ప్రాముఖ్యత ఉంది. సోనియా గాంధీ సూచనల మేరకే పటేల్, మమత భేటీ అయ్యారు. బీజేపీ వ్యతిరేక కూటములను ఏకం చేయడంలో మమత కీలకపాత్ర వహిస్తున్నారు. ఇందులో భాగం కావాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీనిపై అనుసరించాల్సిన వ్యూహంపైనే ఈ భేటీలో చర్చించారు’ అని తృణమూల్ ముఖ్యనేత ఒకరు పేర్కొన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తీరు, కేజ్రీవాల్‌కు మద్దతు తదితర అంశాలపై కాంగ్రెస్, ఇతర విపక్షాల మధ్య భిన్నమైన అభిప్రాయాలున్నప్పటికీ.. వీరిద్దరూ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
నితీశ్ వస్తే మళ్లీ చేర్చుకుంటాం: కాంగ్రెస్
బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ ఎన్డీయే నుంచి బయటకు వస్తే ఆయనను మళ్లీ మహాకూటమిలో చేర్చుకుంటామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి శక్తి సింగ్ గోహిల్ అన్నారు. 2013లో నరేంద్రమోదీని ఎన్డీయే కూటమి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాక జేడీయూ తన 17 ఏళ్ల బంధాన్ని తెంచుకుని ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. 2015 బిహార్ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో మహాకూటమి ఏర్పాటు చేసి గెలిచి, మళ్లీ 2017లో కూటమి నుంచి బయటకు వచ్చి ఎన్డీయేతో చేతులు కలిపింది. 2019 ఎన్నికల్లో సీట్ల పంపకాల విషయంలో బీజేపీ, జేడీయూల మధ్య సయోధ్య లేదనే వార్తలు వస్తున్న నేపథ్యంలో గోహిల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment