సాక్షి,హైదరాబాద్ : ‘‘మజ్లిస్ పార్టీని బతికించి తప్పు చేశాం.. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎన్నికల్లో గట్టి అభ్యర్థులను సైతం పోటీకి పెట్టకుండా దాన్ని ప్రోత్సహించిన తప్పిదాన్ని అంగీకరిస్తున్నాం... ఇందులో తాను భాగస్వామి అయినందుకు చింతిస్తున్నా’’అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ అజాద్ పశ్చాత్తాప పడ్డారు. హైదరాబాద్ పాతబస్తీ పేదరికం, అభివృద్ధి మజ్లిస్‌కు అవస రం లేదని, కావాల్సిందల్లా భూ కబ్జాల్లో పోలీసుల సహకారమని, ఇందుకోసమే కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలో గల పార్టీలతో జతకట్టి వాడుకుంటోందని ధ్వజమెత్తారు. గురువారం గాంధీభవన్‌లో విలేకరులతో అజాద్ మాట్లాడారు. బీజేపీ,టీఆర్‌ఎస్, ఎంఐఎంలు మూడు ఒకటే అని ఆరోపించారు. ఢిల్లీలో ఆ మూడు పార్టీలకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకుడని అభివర్ణించారు. టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు పగలు తిట్టుకుంటాయని, రాత్రయితే ఒప్పందాలు చేసుకుంటాయని విమర్శించారు.
అబద్ధాల్లో ఇద్దరూ ఇద్దరే
ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేయడం, అబద్ధాలు చెప్పడంలో మోదీ, కేసీఆర్‌లిద్దరూ కవలలని గులాం నబీ అజాద్ అభివర్ణించారు. భేటీ బచావో.. భేటీ పడావో అన్నారు.. కానీ మహిళలు, ఆడపిల్లల మీద అత్యాచారాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.కేసీఆర్ దళితుడ్ని సీఎం చేస్తా.. వారికి మూడెకరాల భూమి ఇస్తా.. హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తానన్నారనీ.. కానీ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ఆయన విద్యా వ్యతిరేకి అని, ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా ఇవ్వక పోవడంతో ఇంజనీరింగ్ కళాశాలలు మూత పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో సచివాలయానికి రాని సీఎం ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆరేనని ఎద్దేవా చేశారు. ఇంట్లో కూర్చోవడానికి ఇష్టపడేవారిని ప్రజలు కూడా ఇంట్లోనే కూర్చోపెట్టడం ఖాయమన్నారు.
ఐదు రాష్ట్రాల్లో విజయం తథ్యం
ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు వస్తాయని అజాద్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజా కూటమి ప్రభుత్వం గెలుపు తథ్యమన్నా రు.కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను, జాతులను, ధర్మాలను గౌరవిస్తుందని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బీజేపీతో కలిసి వెళ్లడం ఖాయమని చెప్పారు.
వైఎస్సార్ పుణ్యమే 4 శాతం రిజర్వేషన్..
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమే ముస్లింలకు 4% రిజర్వేషన్ అమలు అని గులాం నబీ అజాద్ స్పష్టం చేశారు. వైఎస్సార్ మన మధ్యలో లేకున్నా రిజర్వేషన్ అమలు చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. 2004లో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జిగా తాను చేపట్టిన బస్సు యాత్రలో ఎవరిని అడగకుండా అధికారంలోకి వస్తే ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్ వర్తింప చేస్తామని ప్రకటించానని, వెంటనే అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసి విషయం చెప్పగా అందుకు ఆయన అంగీకరించారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దానిని అమలు చేశారని చెప్పారు. కోర్టు నాలుగు శాతానికే రిజర్వేషన్ పరిమితం చేసిందన్నారు. 5% శాతం పెంపునకే కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు 12% అమలు ఎలా సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతీ హామీ అమలు చేయడమే కాకుండా అవసరమైతే అదనపు వాగ్దానాలను సైతం అమలు చేసి చూపిస్తుందన్నారు.
Published Fri, Nov 30 2018 3:01 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment