సాక్షి, నల్లగొండ: తన కీలక అనుచరుడైన బొడ్డుపల్లి శ్రీనివాస్ బతికి లేడనే నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సినీ ఫక్కీలో శ్రీనివాస్ హత్య జరిగిందని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ రౌడీ రాజకీయాన్ని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. నల్లగొండలో ఆదివారం జరిగిన శ్రీనివాస్ సంతాప సభలో కోమటిరెడ్డి మాట్లాడారు.
‘మేం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తే.. నల్గొండలో మోరీలన్నీ మొండాలతో నింపేస్తాం’ అని కోమటిరెడ్డి హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే నల్లగొండలో తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. .దేశం కోసం ప్రాణాలర్పించే పార్టీ తమదన్నారు. కేసీఆర్ దొంగ దీక్షతో తెలంగాణ రాలేదన్నారు. ఎమ్మెల్యే వీరేశం కిరాయి హంతకుడిగా మారాడని ధ్వజమెత్తారు.
న్యాయస్థానంపై తమకు నమ్మకముందని, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయం సాధిస్తామన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల కోసం ప్రాణాలైన అర్పిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అవినీతి అధికారుల భరతం పడతామని హెచ్చరించారు.
శ్రీనివాస్ హత్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ కుంతియా తెలిపారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట అని అన్నారు. కాంగ్రెస్ నేతలంతా గాంధేయ మార్గంలో వెళ్తారని, దానిని టీఆర్ఎస్ నేతలు అలుసుగా తీసుకుంటున్నారని విమర్శించారు.
సీఎం కేసీఆర్‌కు సవాల్ చేస్తున్నా.. శ్రీనివాస్ హత్య కేసులో ఎమ్మెల్యే పాత్ర లేదని చెప్పగలరా? అని అన్నారు. లేదంటే సీబీఐ విచారణకు కేసీఆర్ సిద్ధమేనా ప్రశ్నించారు. శ్రీనివాస్ హత్య కేసును రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లి, సీబీఐ విచారణ చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, పార్లమెంట్ సమావేశాల్లోనూ శ్రీనివాస్ హత్య పై ప్రస్తావిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment