సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి జరిగిన విషయం వాస్తవమని, దీనిని ఆధారాలతో సహా నిరూపిస్తానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అవినీతిపై సీబీఐ లేదా సీవీసీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తాను చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించలేకపోతే.. అబిడ్స్ సెంటర్‌లో ముక్కు నేలకు రాస్తానని రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యుత్ కొనుగోళ్లపై బహిరంగ చర్చకు రావాలంటూ టీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరిన నేపథ్యంలో శుక్రవారం రేవంత్‌రెడ్డి గన్‌పార్కు వద్ద విలేకరులతో మాట్లాడారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే సంపత్ కుమార్, నాయకులు కార్తీక్ రెడ్డి, రవీంద్ర నాయక్, జంగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
అవినీతి వాస్తవం!
విభజన సమయంలో తెలంగాణకు 53.89శాతం విద్యుత్ కేటాయింపు ఘనత సోనియాదేనని రేవంత్ అన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో, భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. ఈ విషయమై చర్చకు వస్తామని టీఆర్‌ఎస్ నేతలు బాల్క సుమన్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, భాను ప్రసాద్ సవాల్ విసిరారని, కానీ చర్చకు మేం సిద్ధమని చెప్పాగానే, టీఆర్‌ఎస్ నేతలు తోకమూడిచారని విమర్శించారు.
'నా విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు. పోలవరం కడితే రక్తం ఏరులై పారుతుందని కేసీఆర్ అన్నారు. తర్వాత తన బినామీ సంస్థ ఎస్ఈడబ్ల్యూ కు ఆ ప్రాజెక్టు ఇప్పించుకున్నారు. ఆ సంస్థ నుంచి నమస్తే తెలంగాణలో పెట్టుబడులు పెట్టించుకున్నారు. దాన్ని నేనే బయటకు తీశా.. దాంతో టెండర్ రద్దు చేశారు. అదీ తెలంగాణ పట్ల నా విశ్వసనీయత. నా విశ్వసనీయత ఏమిటో కేసీఆర్, ఆయన కుటుంబాన్ని అడగాలి. ఎవరి విశ్వసనీయత ఏమిటో అమరవీరుల కుటుంబాలు, ఓయూ విద్యార్థులను అడుగుదాం' అని రేవంత్ విరుచుకుపడ్డారు. 'పోలీసు రక్షణ లేకుండా కేసీఆర్ వస్తారా? దళితుడ్ని సీఎం చేస్తానన్నావు. సోనియా కాళ్లు మొక్కి పార్టీ విలీనం చేస్తానన్నావు. ఇదేనా విశ్వసనీయత అంటే?' అని రేవంత్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment