సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గడిబిడి జరిగిందని శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. పోలైన ఓట్లకు, కౌంటింగ్ ఓట్లకు తేడా వచ్చిందన్నారు. వేల సంఖ్యలో ఓట్ల తేడా ఎలా వచ్చిందో ఈసీ, ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. రాత్రికిరాత్రే 11 శాతం ఓటింగ్ ఎలా పెరిగిందని ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లోకి పిరాయించిన దామోదర రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దామోదర రెడ్డి ఫిరాయింపుకు సంబంధించి పూర్తి వివరాలు మండలి చైర్మన్‌కు అందించామన్నారు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలకు నోటీసులు ఇచ్చిన చైర్మన్..తాము ఇచ్చిన ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని నాలుగేళ్లుగా ఫిర్యాదు చేసిన కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయించిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను నాలుగున్నరేళ్లు మంత్రిగా కొనసాగించారని విమర్శించారు. కేసీఆర్‌కి శిత్తశుద్ది ఉంటే ఇప్పటికైనా టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలన్నారు.
గెలుపు ఓటమిలు సహజం
రాజకీయాల్లో గెలుపు ఓటమిలు సహజమని షబ్బీర్ అలీ అన్నారు. ఓడిపోయినంత మాత్రన ఇంట్లో ఉండమని, ప్రజల పక్షాన పోరాడుతామని చెప్పారు. నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీలపై అప్పుడే కేసీఆర్ మాటమార్చారని దుయ్యబట్టారు. మూడు రాష్ట్రాల్లో రైతు రుణ మాఫీపై తొలి సంతకం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని చెప్పారు. కాంగ్రెస్ క్రెడిబిలిటీ ఏంటో.. కేసీఆర్ క్రెడిబిలిటీ ఏంటో ప్రజలకు తెలుసన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఎందుకు పిటిషన్ వేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం తీరుతో వేయి మంది బీసీ సర్పంచ్‌లు, 9వేల మంది వార్డ్ మెంబర్‌లు నష్టపోయారని ఆరోపించారు. బీసీలు మెల్కొని ప్రభుత్వ తీరును ప్రశ్నించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment