
సాక్షి, హైదరాబాద్: శాసనసభా సమావేశాల తొలిరోజు కాంగ్రెస్‌సభ్యుల్లో గందరగోళం కనిపించింది. మొత్తం ఆరుగురు సభ్యులే ఉన్నా, వారిలోనూ ఏకాభిప్రాయం లేదు. టీఆర్‌ఎస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందంటూ చేపట్టిన నిరసనలో నలుగురే పాల్గొన్నారు. జగ్గారెడ్డి దూరంగా ఉన్నట్టు వ్యవహరించారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కలిసి రాలేదు. రాజగోపాల్‌రెడ్డి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్‌ను ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు.
ముందుగా సీఎల్పీ
తొలిరోజు గురువారం సభ ప్రారంభానికి ముందే సీఎల్పీ నేత భట్టి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, వీరయ్య హాజరు కాగా, రాజగోపాల్‌రెడ్డి డుమ్మా కొట్టారు. నల్లకండువాలతో సభకు వెళ్లి టీఆర్‌ఎస్ ఫిరాయింపులకు నిరసన తెలపాలని సమావేశంలో నిర్ణయించారు. అయితే, జగ్గారెడ్డి నల్లకండు వా లేకుండానే సభలోకి వెళ్లారు. మిగిలిన నలుగురు నల్లకండువాలతో వెళ్లి సభలో నినాదాలు చేశారు. అప్పుడు కూడా జగ్గారెడ్డి వారితో కలవకుండా అసెంబ్లీ సమావేశ మందిరం నుంచి బయటకు వచ్చేశారు.
రాజగోపాల్... మళ్లీ హల్‌చల్
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి హల్‌చల్ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు కాంగ్రెస్ సభ్యులతో కలిసిరాలేదు. తాను కాంగ్రెస్‌లో ఉన్నానని, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని, బీజేపీనే టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయమన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని చెప్పారు.