
ఇప్పటికే టీఆర్‌ఎస్- మజ్లిస్ పార్టీలు కూటమిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
సాక్షి, కరీంనగర్ : పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయనున్న మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఆదిలాబాద్- కరీంనగర్- నిజామాబాద్- మెదక్ జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి ఆయన పోటీ చేయనున్న విషయం తెలిసిందే. నామినేషన్ వేసిన అనంతరం జీవన్‌రెడ్డి మాట్లాడుతూ... ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కృతఙ్ఞతలు తెలిపారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని విస్మరించి విద్యార్థులకు అన్యాయం చేసిందని ఆరోపించారు. ప్రజా గొంతుక వినిపించేందుకే తాను మండలికి పోటీ చేస్తున్నానని వ్యాఖ్యానించారు.
ఇక ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం ప్రకటన చేయడంతో గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా మండలి ఎన్నికల్లో సంఖ్యాపరంగా కాంగ్రెస్‌కు ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కనుంది. ఇప్పటికే టీఆర్‌ఎస్- మజ్లిస్ పార్టీలు కూటమిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఐదు స్థానాలకు గానూ టీఆర్‌ఎస్ నుంచి నలుగురు, మజ్లిస్ నుంచి ఒకరు నామినేషన్ వేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పోటీకి దిగుతున్నట్లు ప్రకటించడంతో ఎన్నిక అనివార్యమైంది. అయితే తమ అభ్యర్థిని గెలిపించుకోవాలంటే కాంగ్రెస్‌కు 21మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాగా ప్రస్తుతం వారి బలం19. దీంతో ప్రస్తుతం పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.