గువాహతి: కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేయడంలో ఆరితేరిపోయిందని, ఒకవేళ వారు పాకిస్తాన్‌లో పోటీచేస్తే అక్కడ ఆ పార్టీ గెలిచేందుకు అవకాశముంటుందని బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆదివారం గువాహతిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చాలా విషయాలపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై భారత్‌లోకంటే పాకిస్తాన్‌లోనే స్పందన ఎక్కువగా వస్తున్నదని, పొరుగుదేశంలోనే వారి వ్యాఖ్యలకు విపరీతంగా ప్రచారం లభిస్తోందని ఆయన అన్నారు.
ఒకవేళ కాంగ్రెస్ పాకిస్తాన్‌లో ప్రతిపక్షంగా ఉంటే విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, దేశంలో ప్రధాన ప్రతిపక్షం తీరు ఇలా ఉందని ఆయన అన్నారు. ‘ప్రభుత్వంపైనా, ప్రధానిపైనా విమర్శించడానికి ఏమీ లేక వారు పాకిస్తాన్ విషయంలో అబద్ధాలతో కాలం వెల్లదీస్తున్నారు’అని రాంమాధవ్ విమర్శించారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప బీజేపీ అగ్రనేతలకు రూ.1,800 కోట్ల లంచం ఇచ్చారన్న ఆరోపణలపై విలేకరులు ప్రశ్నించగా రాంమాధవ్ తీవ్రంగా ఖండించారు.
‘అది పూర్తిగా సత్యదూరం, ప్రతిపక్షానికి ఆరోపించడానికి ఏమీ లేక ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అయినా ఇది 2011లో జరిగిందని అంటున్నారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అధికారంలో ఉన్నది, వారు ఆ సమయంలో నిద్ర పోతున్నారా’అని వ్యాఖ్యానించారు. వారి ఆరోపణల్లో ఏమాత్రం పస లేదు, దేశమంతా మోదీ గాలి వీస్తోంది, గతంలో కన్నా ఎక్కువ సీట్లు బీజేపీ గెలవబోతోంది అని అన్నారు. బీజేపీ ఒంటరిగా 2014కన్నా ఎక్కువగా సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఎన్డీయే పక్షాలు సైతం మెజారిటీ సీట్లు గెలుచుకుంటారు. పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ కచ్చితంగా సాధిస్తాం’అని పునరుద్ఘాటించారు.
Comments
Please login to add a commentAdd a comment