ముఖేశ్ గౌడ్ నివాసంలో ఉత్తమ్, ముఖేశ్‌ల కరచాలనం. చిత్రంలో కూన శ్రీశైలం గౌడ్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ రద్దు అవుతుందని, డిసెంబర్‌లో ఎన్నికలు వస్తాయనే సంకేతాలతో టీపీసీసీ ముఖ్యులు మరోమారు భేటీ అయ్యారు. బుధవారం సాయంత్రం జాంబాగ్‌లోని మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ నివాసంలో సమావేశమై రాజకీయ పరిణామాలను బట్టి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. సమావేశంలో భాగంగా గురువారం కేసీఆర్ తీసుకునే నిర్ణయం వెలువడిన అనంతరం తాము ఏం చేయాలనే దానిపై చర్చించినట్టు తెలుస్తోంది.
సీఎం ఏ నిర్ణయం తీసుకున్నా తాము ఎన్నికలకు సిద్ధమైపోవాలని, కార్యక్రమాలను ముమ్మరం చేయాలని నిర్ణయించినట్టు సమావేశంలో పాల్గొన్న సీనియర్ నేత ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సలీం, శ్రీనివాస కృష్ణన్, మధుయాష్కీ, దామోదర రాజనర్సింహ, డీకే.అరుణ, శ్రీధర్‌బాబు, రేవంత్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి, పటోళ్ల శశిధర్‌రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, భిక్షపతియాదవ్, విష్ణు, విక్రంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
డీఎస్‌ను ఆహ్వానిస్తాం: రాజనర్సింహ
రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కాంగ్రెస్‌లోకి వస్తే ఆహ్వానిస్తామని మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడుతూ డీఎస్ రాకను తాము స్వాగతిస్తామని, అయితే పదవులు, సీట్ల విషయం పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. తమ పార్టీని ఎవరూ విడచివెళ్లరని, అన్నీ ఊహాగానాలేనన్నారు. తెలుగుదేశం ఓ రాజకీయ పార్టీ అని, మరో రాజకీయ పార్టీగా దానితో కలసి వెళ్లడంలో తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. ఏదైనా పొత్తుల విషయం హైకమాండ్ చూసుకుంటుందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment