శాసనమండలిలో కర్ణాటక కాంగ్రెస్ మంత్రి జయమాల
బెంగళూరు : కాంగ్రెస్ పార్టీ మంత్రి, నటి జయమాల(59)పై కర్ణాటకలో ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ(బీజేపీ) విరుచుకుపడింది. తొలి రోజు శాసనమండలి సమావేశాల్లో జయమాలే టార్గెట్‌గా బీజేపీ నాయకులు విమర్శలు గుప్పించారు. ఇంత జరుగుతున్నా మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు నోరు మెదపలేదు. మంత్రి, ప్రభుత్వంపై మాట పడకుండా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.
కాంగ్రెస్ పార్టీలో చీలికల వల్లే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. కావాలనే మంత్రిని కాంగ్రెస్ నాయకులు ఒంటరిని చేసినట్లు స్పష్టమవుతోంది. జయమాలకు రాజకీయ అనుభవం తక్కువగా ఉండటం బీజేపీకి కలిసొచ్చింది. తొలిసారి ఎమ్మెల్సీగా నామినేట్ అయిన జయమాలకు జేడీఎస్-కాంగ్రెస్ కూటమిలో మంత్రి పదవి దక్కింది. దీనిపై సీనియర్ ఎమ్మెల్సీలు గుర్రుగా ఉన్నారు. ఈ మేరకు పలుమార్లు బహిరంగ వ్యాఖ్యలు సైతం చేశారు.
కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు మహిళా ఎమ్మెల్యేలు సైతం జయమాలకు మంత్రి పదవి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కుమారస్వామి ప్రభుత్వం జయమాలకు మంత్రి కిరీటాన్ని కట్టబెట్టింది. అంతేకాకుండా శాసనమండలిలో ఫ్లోర్ లీడర్‌గా కూడా జయమాలను నిల్చొబెట్టింది. కర్ణాటక కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాల్కర్ అయితే జయమాలకు మంత్రి పదవి ఇవ్వడంపై బలంగా గొంతు వినిపించారు.
తన ‘సర్వీస్’ కన్నా జయమాల ‘సర్వీస్’ పార్టీకి నచ్చిందని వ్యాఖ్యానించారు. దీంతో జయమాల, లక్ష్మీపై మండిపడ్డారు. ఒక మహిళ అభ్యుదయాన్ని మరో మహిళ అడ్డుకోవడం సరికాదని అన్నారు. లక్ష్మీ వ్యాఖ్యలను మహిళా సంఘాలు సైతం ఖండించాయి. కర్ణాటక కాంగ్రెస్ ఇన్‌చార్జ్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాలే జయమాలకు పదవి దక్కడానికి కారణమని 20 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఈ విషయాన్నే పార్టీ బాస్‌లకు ఫిర్యాదు రూపంలో అందించారు కూడా.
రాజకీయాల్లో అనుభవ లేమి కలిగిన వ్యక్తిని సభకు నాయకురాలిగా ఎన్నుకుంటే, ప్రతిపక్ష బీజేపీని ఎలా ఎదుర్కొంటామని కాంగ్రెస్ సీనియర్లు బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. కాగా, వీటన్నింటిపై జాతీయ మీడియాతో మాట్లాడిన జయమాల ‘తాను రాజకీయ శాస్త్రంలో బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందాను. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్‌కు చైర్మన్‌గా పని చేశాను. 1990 నుంచి రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నాను. నా ఎంపికను తట్టుకోలేని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. శాసనమండలిలో నా ప్రతిభను చూపి విమర్శలను తిప్పికొడతాను.’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment