Jayamala
-
మా మంత్రి చాలా గ్లామర్
బనశంకరి: స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో కన్నడనటి, మంత్రి జయమాల గ్లామర్ గురించి మాజీ మంత్రి బహిరంగంగా కొనియాడారు. బుధవారం ఉడుపిలో కాంగ్రెస్ నేత ప్రమోద్ మధ్వరాజ్ స్థానిక సంస్థల ఎన్నికల కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సమయంలో ఉడుపి జిల్లా ఇన్చార్జ్మంత్రి జయమాల గ్లామర్‌గా ఉందని, ఆమె జిల్లా పర్యటనతో జయమాల గాలి వీస్తోందని అన్నారు. ఒక్కరోజు ప్రచారంతో జిల్లాలో తీవ్ర ప్రభావం చూపారని, జయమాల తనకంటే గ్లామరస్ గా ఉందని అన్నారు. మంత్రి వ్యాఖ్యలతో కార్యకర్తలు, విలేకరులు తెల్లబోయారు. -
మంత్రి జయమాలను ఒంటరి చేశారు..
బెంగళూరు : కాంగ్రెస్ పార్టీ మంత్రి, నటి జయమాల(59)పై కర్ణాటకలో ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ(బీజేపీ) విరుచుకుపడింది. తొలి రోజు శాసనమండలి సమావేశాల్లో జయమాలే టార్గెట్‌గా బీజేపీ నాయకులు విమర్శలు గుప్పించారు. ఇంత జరుగుతున్నా మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు నోరు మెదపలేదు. మంత్రి, ప్రభుత్వంపై మాట పడకుండా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ పార్టీలో చీలికల వల్లే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. కావాలనే మంత్రిని కాంగ్రెస్ నాయకులు ఒంటరిని చేసినట్లు స్పష్టమవుతోంది. జయమాలకు రాజకీయ అనుభవం తక్కువగా ఉండటం బీజేపీకి కలిసొచ్చింది. తొలిసారి ఎమ్మెల్సీగా నామినేట్ అయిన జయమాలకు జేడీఎస్-కాంగ్రెస్ కూటమిలో మంత్రి పదవి దక్కింది. దీనిపై సీనియర్ ఎమ్మెల్సీలు గుర్రుగా ఉన్నారు. ఈ మేరకు పలుమార్లు బహిరంగ వ్యాఖ్యలు సైతం చేశారు. కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు మహిళా ఎమ్మెల్యేలు సైతం జయమాలకు మంత్రి పదవి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కుమారస్వామి ప్రభుత్వం జయమాలకు మంత్రి కిరీటాన్ని కట్టబెట్టింది. అంతేకాకుండా శాసనమండలిలో ఫ్లోర్ లీడర్‌గా కూడా జయమాలను నిల్చొబెట్టింది. కర్ణాటక కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాల్కర్ అయితే జయమాలకు మంత్రి పదవి ఇవ్వడంపై బలంగా గొంతు వినిపించారు. తన ‘సర్వీస్’ కన్నా జయమాల ‘సర్వీస్’ పార్టీకి నచ్చిందని వ్యాఖ్యానించారు. దీంతో జయమాల, లక్ష్మీపై మండిపడ్డారు. ఒక మహిళ అభ్యుదయాన్ని మరో మహిళ అడ్డుకోవడం సరికాదని అన్నారు. లక్ష్మీ వ్యాఖ్యలను మహిళా సంఘాలు సైతం ఖండించాయి. కర్ణాటక కాంగ్రెస్ ఇన్చార్జ్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాలే జయమాలకు పదవి దక్కడానికి కారణమని 20 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఈ విషయాన్నే పార్టీ బాస్‌లకు ఫిర్యాదు రూపంలో అందించారు కూడా. రాజకీయాల్లో అనుభవ లేమి కలిగిన వ్యక్తిని సభకు నాయకురాలిగా ఎన్నుకుంటే, ప్రతిపక్ష బీజేపీని ఎలా ఎదుర్కొంటామని కాంగ్రెస్ సీనియర్లు బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. కాగా, వీటన్నింటిపై జాతీయ మీడియాతో మాట్లాడిన జయమాల ‘తాను రాజకీయ శాస్త్రంలో బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందాను. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్‌కు చైర్మన్‌గా పని చేశాను. 1990 నుంచి రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నాను. నా ఎంపికను తట్టుకోలేని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. శాసనమండలిలో నా ప్రతిభను చూపి విమర్శలను తిప్పికొడతాను.’ అని వ్యాఖ్యానించారు. -
పదవులన్నీ ఆమెకేనా.?
సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ - జేడీఎస్ కూటమిలో భాగంగా ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలోని మంత్రులపై పలువురు సీనియర్ నాయకులు తిరుగుబాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్‌లో ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమే. ఈ క్రమంలో నటి, ఎమ్మెల్సీ జయమాలకు మంత్రి పదవి ఇవ్వడంపై చాలామంది అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం మంత్రి జయమాలకు మండలిలో అధికార పార్టీ నాయకురాలి హోదా కట్టబెడుతున్నారని సమాచారం. అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మండలి పరిషత్ సభ్యులు హెచ్ఎం రేవణ్ణ, వీఎస్ ఉగ్రప్ప, అబ్దుల్ జబ్బార్ తదితరులు మంత్రి జయమాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేందుకు సిద్ధమయ్యారు. పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి మాట్లాడేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తగిన సంఖ్యా బలం లేదు.. మండలిలో కాంగ్రెస్ పార్టీకి తగిన సంఖ్యా బలం లేదు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నవారికే పార్టీ హోదా కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఏమీ తెలియని జయమాలకు మంత్రి పదవి ఎందుకు ఇచ్చారో తెలియలేదని ఆవేదన చెందారు. అయితే మళ్లీ ఇప్పుడు మండలిలో ఉన్నత హోదా కల్పించడమేంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేబినెట్లో చోటు కోసం పోటీపడి మండలి నుంచి స్థానం పొందారు. ఎంతో మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మహిళల కోటాలో జయమాలకు అవకాశం కల్పించారు. అన్ని పదవులూ ఆమెకే కట్టబెడితే మిగతా వారి పరిస్థితేంటని పలువురు ఆవేదన చెందుతున్నారు. -
ఇకపై వారిని అలా పిలువరాదు
బొమ్మనహళ్లి : సెక్స్ వర్కర్లను ఇక పైన ధమనిత మహిళలు అని పిలవాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ, కన్నడ సంస్కృతి శాఖ మంత్రి జయమాల సూచించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా మంగళవారం తన శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధిపనులు, అమలు తీరు, ప్రగతి తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ సెక్స్ వర్కర్లను ఆ పేరుతో పిలు వరాదని, వారిని ధమనిత మహిళ అని పిలిచేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. వెనుకబడిన వర్గాల మహిళల సంక్షేమానికి అమలు చేసే పథకాలు లబ్ధిదా రుల దరిచేరేలా చూడాలన్నారు. ఆపదల్లో ఉన్న మహిళలను ఆదుకోవడానికి ముందుండాలని అన్నారు. కన్నడ, సంస్కృతి శాఖలో కళాకారులకు పింఛన్ల పంపిణీ, ఇతర సదుపాయాల కల్పనపై కసరత్తు చేస్తామన్నారు. -
అప్పట్లో ప్రచారం కోసమే వాడుకునేవాళ్లు
సాక్షి, బెంగళూరు: చిన్నవయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల పక్కన చేసే అవకాశం దక్కించుకున్నారు. కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు, వివాదాలు. అయినా తొణకలేదు. చివరకు రాజకీయాల్లో ప్రవేశించిన ఆమెకు ఆత్మీయ స్వాగతం లభించింది. కాంగ్రెస్ పార్టీ తరపున నేరుగా శాసన మండలిలోకి ఆమె అడుగుపెట్టారు. ఇప్పుడు ఏకంగా మంత్రి పదవి దక్కించుకుని.. కన్నడ రాజకీయాల్లో ఆ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా జయమాల(62) నిలిచారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, కన్నడ సాంస్కృతిక శాఖ మంత్రి జయమాల మాటల్లో... ‘సినిమాల్లో ఉన్నప్పుడు రాజకీయ ఆలోచనలు ఏనాడూ నాకు కలగలేదు. ఆ సమయంలో సినిమా వాళ్లను కేవలం ఎన్నికల ప్రచారం కోసమే వాడుకునేవాళ్లు. ఆ జాబితాలో నేనూ ఉన్నాను. రోజుల తరబడి పార్టీల కోసం తిరిగిన దాఖలాలు ఉన్నాయి. కానీ, కాంగ్రెస్ అంటే నాకు మొదటి నుంచి ఎందుకనో చాలా ఇష్టం. బహుశా ఇందిరా గాంధీ, సోనియా గాంధీ లాంటి శక్తివంతమైన మహిళలు ఆ పార్టీలో ఉన్నందుకే కాబోలు. ఆ తర్వాత పార్టీలో చేరిన నేను క్రియాశీలకంగా వ్యవహరించటం మొదలుపెట్టాను. పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి. ...మంది పదవి దక్కుతుందని అస్సలు ఊహించలేదు. ఆ విషయం మీడియా ద్వారానే తెలుసుకున్నా. నా భర్త, కూతురికి కూడా ఈ విషయం చెప్పేంత సమయం కూడా లేకుండా పోయింది. ప్రమాణం చేశాక నా కుటుంబ సభ్యులంతా చాలా సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి, కర్ణాటక కాంగ్రెస్ కేడర్‌కు నా ధన్యవాదాలు. సీఎం కుమారస్వామిగారు నాకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్దితో నెరవేరుస్తా’ అని ఆమె ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. స్టార్ హీరోయిన్గా... కాగా, 1980లలో తెలుగు, తమిళ, కన్నడ, తుళు భాషల్లో నటించిన జయమాల స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్నారు. రాజ్‌కుమార్, అనంత నాగ్, విష్ణువర్ధన్, అంబరీష్, శంకర్ నాగ్, ప్రభాకర్ లాంటి స్టార్ హీరోల సరసన ఆమె నటించారు. తెలుగులో చిరంజీవితో కలిసి రాక్షసుడు చిత్రంలో కనిపించారు. అందులో తారకేశ్వరి పాత్రలో నటించింది ఆమెనే. తర్వాత నిర్మాతగా కూడా ఆమె పలు చిత్రాలను నిర్మించారు. వివాదాలు... కాగా, కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్‌పర్సన్‌గా పని చేసిన సమయంలో ఆమె వైఖరిపై పలు విమర్శలు వినిపించాయి. అంతేకాదు తాను యుక్తవయసు(20 ఏళ్ల ప్రాయంలో)లో ఉన్నప్పుడు శబరిమళ ఆలయాన్ని సందర్శించి.. అయ్యప్ప విగ్రహాన్ని తాకానని ఆమె చేసిన ప్రకటన అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యవహారం కేసు.. కోర్టు దాకా వెళ్లింది కూడా. -
ఘనంగా.. అన్న అవార్డులు
బెంగళూరు : వారిద్దరూ వారి రంగాల్లో లబ్ధప్రతిష్టులు. చంద్రునికో నూలుపోగన్నట్లు మరో అవార్డు ఖాతాలో జమైంది. 2017 సంవత్సరానికి డాక్టర్ ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, నటి, ఎమ్మెల్సీ జయమాలకు శనివారం సాయంత్రం బెంగళూరు టౌన్హాల్లో కర్ణాటక తెలుగు అకాడెమి అందజేసింది. అకాడెమి వ్యవస్థాపక అధ్యక్షుడు ఏ.రాధకృష్ణరాజు, అధ్యక్షుడు ఆర్.వి.హరిష్ తదితరులు వారికి పురస్కారాలను బహూకరించారు. అకాడమి నేతలు ఆర్.ఉమాపతి నాయుడు, సి.వి.శ్రీనివాసయ్య పాల్గొన్నారు. -
‘పెద్దల’ జాబితాకు ఆమోద ముద్ర
కమలనాథుల ఆశలు అడియాసలు బెంగళూరు : శాసన మండలికి వివిధ రంగాల్లోని ఐదుగురిని ప్రభుత్వం నామినేట్ చేసే విషయమై ఏర్పడిన ప్రతిష్టంభన ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం తొలగిపోయింది. వీఎస్. ఉగ్రప్ప, నటి జయమాల, ఇక్బాల్ అహమ్మద్ సరడగి, అబ్దుల్ జబ్బార్, ఐవాన్ డిసౌజాల పేర్లతో కూడిన జాబితాపై గవర్నర్ హెచ్ఆర్. భరద్వాజ్ ఆమోద ముద్ర వేశారు. అంతకు ముందు రాజ్ భవన్లో గవర్నర్‌ను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కలుసుకుని జాబితాను అందజేశారు. గవర్నర్ ఈ నెల 29న రిటైర్ కావాల్సి ఉంది. ఆలోగా జాబితాపై ఆమోద ముద్ర వేయించుకోవాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తహతహలాడారు. ఎగువ సభలో ప్రస్తుతం ప్రభుత్వానికి మెజారిటీ లేదు. కనుక కీలక బిల్లులు తిరస్కరణకు గురైతే శాసన సభలో రెండో సారి ఆమోదించుకోవాల్సి ఉంటుంది. సంఖ్యా బలాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వానికి ఈ నియామకాలు అత్యవసరం. భరద్వాజ్ రిటైర్ అయితే బీజేపీ మద్దతుదారుడిని గవర్నర్‌గా నియమిస్తారనేది బహిరంగ రహస్యం. అలాంటి సందర్భంలో ప్రభుత్వం సిఫార్సు చేసే పేర్లకు ఆమోదం లభించే అవకాశాలు తక్కువ. ఈ జాబితాలోని...ఉగ్రప్ప, ఇక్బాల్ అహమ్మద్ సరడగి, అబ్దుల్ జబ్బార్, ఐవాన్ డిసౌజాలకు రాజకీయ నేపథ్యం ఉన్నదని, కనుక వారి పేర్లతో కూడిన జాబితాను ఆమోదించ వద్దని గవర్నర్‌కు బీజేపీ విజ్ఞప్తి చేసింది. గవర్నర్ ఆమోదించకుండా చూడాలని కేంద్ర హోం శాఖ మంత్రికి సైతం లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పంపించే జాబితాకు ఆమోదం లభిస్తుందా అనే సందిగ్ధం నెలకొంది. అయితే రాష్ర్ట ప్రభుత్వ సిఫార్సులను గవర్నర్ యథావిధిగా ఆమోదించాలనే నియమం ఉందని కొందరు వాదిస్తూ వచ్చారు. గతంలో ఇదే గవర్నర్, యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాజీ మంత్రి వీ. సోమన్నను నామినేట్ చేయడానికి ససేమిరా అన్నారు. అదే సంప్రదాయంతో ఇప్పుడూ ‘కాంగ్రెస్ జాబితా’ను తిరస్కరిస్తారనే బీజేపీ ఆశలు అడియాసలయ్యాయి.