‘పెద్దల’ జాబితాకు ఆమోద ముద్ర
కమలనాథుల ఆశలు అడియాసలు
బెంగళూరు : శాసన మండలికి వివిధ రంగాల్లోని ఐదుగురిని ప్రభుత్వం నామినేట్ చేసే విషయమై ఏర్పడిన ప్రతిష్టంభన ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం తొలగిపోయింది. వీఎస్. ఉగ్రప్ప, నటి జయమాల, ఇక్బాల్ అహమ్మద్ సరడగి, అబ్దుల్ జబ్బార్, ఐవాన్ డిసౌజాల పేర్లతో కూడిన జాబితాపై గవర్నర్ హెచ్‌ఆర్. భరద్వాజ్ ఆమోద ముద్ర వేశారు. అంతకు ముందు రాజ్ భవన్‌లో గవర్నర్‌ను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కలుసుకుని జాబితాను అందజేశారు. గవర్నర్ ఈ నెల 29న రిటైర్ కావాల్సి ఉంది. ఆలోగా జాబితాపై ఆమోద ముద్ర వేయించుకోవాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తహతహలాడారు. ఎగువ సభలో ప్రస్తుతం ప్రభుత్వానికి మెజారిటీ లేదు. కనుక కీలక బిల్లులు తిరస్కరణకు గురైతే శాసన సభలో రెండో సారి ఆమోదించుకోవాల్సి ఉంటుంది. సంఖ్యా బలాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వానికి ఈ నియామకాలు అత్యవసరం. భరద్వాజ్ రిటైర్ అయితే బీజేపీ మద్దతుదారుడిని గవర్నర్‌గా నియమిస్తారనేది బహిరంగ రహస్యం. అలాంటి సందర్భంలో ప్రభుత్వం సిఫార్సు చేసే పేర్లకు ఆమోదం లభించే అవకాశాలు తక్కువ. ఈ జాబితాలోని...ఉగ్రప్ప, ఇక్బాల్
అహమ్మద్ సరడగి, అబ్దుల్ జబ్బార్, ఐవాన్ డిసౌజాలకు రాజకీయ నేపథ్యం ఉన్నదని, కనుక వారి పేర్లతో కూడిన జాబితాను ఆమోదించ వద్దని గవర్నర్‌కు బీజేపీ విజ్ఞప్తి చేసింది. గవర్నర్ ఆమోదించకుండా చూడాలని కేంద్ర హోం శాఖ మంత్రికి సైతం లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పంపించే జాబితాకు ఆమోదం లభిస్తుందా అనే సందిగ్ధం నెలకొంది. అయితే రాష్ర్ట ప్రభుత్వ సిఫార్సులను గవర్నర్ యథావిధిగా ఆమోదించాలనే నియమం ఉందని కొందరు వాదిస్తూ వచ్చారు. గతంలో ఇదే గవర్నర్, యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాజీ మంత్రి వీ. సోమన్నను నామినేట్ చేయడానికి ససేమిరా అన్నారు. అదే సంప్రదాయంతో ఇప్పుడూ ‘కాంగ్రెస్ జాబితా’ను తిరస్కరిస్తారనే బీజేపీ ఆశలు అడియాసలయ్యాయి.