నటి జయమాల
సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ - జేడీఎస్ కూటమిలో భాగంగా ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలోని మంత్రులపై పలువురు సీనియర్ నాయకులు తిరుగుబాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్‌లో ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమే. ఈ క్రమంలో నటి, ఎమ్మెల్సీ జయమాలకు మంత్రి పదవి ఇవ్వడంపై చాలామంది అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం మంత్రి జయమాలకు మండలిలో అధికార పార్టీ నాయకురాలి హోదా కట్టబెడుతున్నారని సమాచారం. అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మండలి పరిషత్ సభ్యులు హెచ్‌ఎం రేవణ్ణ, వీఎస్ ఉగ్రప్ప, అబ్దుల్ జబ్బార్ తదితరులు మంత్రి జయమాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేందుకు సిద్ధమయ్యారు. పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి మాట్లాడేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
తగిన సంఖ్యా బలం లేదు..
మండలిలో కాంగ్రెస్ పార్టీకి తగిన సంఖ్యా బలం లేదు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నవారికే పార్టీ హోదా కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఏమీ తెలియని జయమాలకు మంత్రి పదవి ఎందుకు ఇచ్చారో తెలియలేదని ఆవేదన చెందారు. అయితే మళ్లీ ఇప్పుడు మండలిలో ఉన్నత హోదా కల్పించడమేంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేబినెట్లో చోటు కోసం పోటీపడి మండలి నుంచి స్థానం పొందారు. ఎంతో మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మహిళల కోటాలో జయమాలకు అవకాశం కల్పించారు. అన్ని పదవులూ ఆమెకే కట్టబెడితే మిగతా వారి పరిస్థితేంటని పలువురు ఆవేదన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment