సాక్షి, హైదరాబాద్: టీఆర్‌స్‌పై కాంగ్రెస్ నాయకులు రామ్మోహన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, గజ్జెల కాంతం మండిపడ్డారు. కాంగ్రెస్ దయ వల్ల కేసీఆర్ ముఖ్యమంత్రి కాగలిగారనీ, కానీ కనీస స్పృహ లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో 34వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిన కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ విమర్శలు చేయడం అవివేకమని రామ్మోహన్‌రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణాలన్నిటిని మాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు. రుణాలు మాఫీ కాకాపోవడంతో వడ్డీల భారంతో రైతులు కుంగిపోతున్నారని అన్నారు.
నయీమ్ ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేయాలి
నయీమ్ గ్యాంగ్‌స్టర్‌గా మారడానికి పొలికల్ లీడర్స్, పోలీసులే కారకులని గజ్జెల కాంతం అన్నారు. నయీమ్ హత్యానంతరం పట్టబడిన డబ్బు, ఆస్తులు కేసీఆర్ ఖాతాలోకి వెళ్లాయా.. ప్రభుత్వ ఖజానాలోకి వెళ్లాయా వెల్లడించాలనీ.. నయీమ్ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసుతో సంబంధాలున్న 25 మంది పోలీసులపై, రెవెన్యూ యంత్రాంగంపై చర్యలు తీసుకోవడంతో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అవినీతి నేతలకు, అధికారులకు టీఆర్‌ఎస్ అండగా నిలుస్తోందనీ ఆరోపించారు. రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదని మండిపడ్డారు.
తప్పులను కప్పిపుచ్చుకోవడానికే రైతుబంధు
టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే రైతుబంధు పథకం పెట్టారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గతంలో ప్రాణహిత తప్పుడు ప్రాజెక్టు అని వ్యాఖ్యానించిన కేసీఆర్.. ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని ఎందుకు కోరారని మండిపడ్డారు. ప్రభుత్వానికి దమ్ముంటే ఈ అంశంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment