సాక్షి, హైదరాబాద్: దేశంలోని అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదోది, తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక శక్తి పీఠమైన జోగుళాంబ సన్నిధి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తోంది. గురువారం ఉదయం 10 గంటలకు జోగుళాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి లాంఛనంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని టీపీసీసీ నిర్ణయించింది. గురువారం గురు బలం కలిసి వస్తుందని, కార్యసాధనకు మంచి రోజనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి. జోగుళాంబ సన్నిధిలో పూజలు నిర్వహించిన అనంతరం అలంపూర్ పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం శాంతినగర్ చౌరస్తా, ఐజ మున్సిపాలిటీలో రోడ్ షోలు నిర్వహించిన తర్వాత మాజీ మంత్రి డీకే అరుణ ప్రాతినిధ్యం వహిస్తున్న గద్వాల నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. అక్కడ జములమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సాయంత్రం 6 గంటలకు పట్టణంలోని రాజీవ్‌చౌక్ వద్ద భారీ బహిరంగ సభలో టీపీసీసీ నేతలు పాల్గొంటారు. ప్రచార కార్యక్రమాన్ని గురువారం లాంఛనంగా మాత్రమే ప్రారంభిస్తున్నామని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ప్రచారానికి సంబంధించిన తుది షెడ్యూల్‌ను రెండు, మూడ్రోజుల్లో వెల్లడిస్తామని చెప్పడం గమనార్హం.
హెలికాప్టర్‌లో అలంపూర్‌కు..
ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా అలంపూర్‌కు హెలికాప్టర్‌లో వెళ్లనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా, ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క, టీపీసీసీ ముఖ్య నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ, విజయశాంతి, పొన్నం ప్రభాకర్, వి.హనుమంతరావు, మహ్మద్ సలీంలు హెలికాప్టర్‌లో వెళ్లి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి.
ఆగమేఘాల మీద ఏర్పాట్లు..
తిథి పరంగా గురువారం దశమి కావడం, తర్వాత 4 రోజులు ముహూర్తం అంత బాగా లేకపోవడంతో నేటి నుంచే ప్రచారం ప్రారంభించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముఖ్యులు నిర్ణయించారు. దీంతో డీకే.అరుణ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కు సమాచారమిచ్చారు. అలంపూర్‌లో ప్రత్యేక పూజలు, భారీ బహిరంగ సభ కోసం సంపత్ ఆధ్వర్యంలో ఆగమేఘాల మీద ఏర్పాట్లు జరుగుతున్నాయి. గద్వాల సభ కోసం డీకే.అరుణ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment