సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మిగిలింది ఏమీ లేదని పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ ఏ ఒక్క స్థానంలోనూ మాకు పోటీ ఇవ్వలేకపోయిందని చెప్పారు. తెలంగాణభవన్‌లో మంత్రి తలసాని సోమవారం విలేకరులతో మాట్లాడారు. ‘దేశం గర్వపడే విధంగా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తోంది. ఇటీవల ఉగ్రవాదులను తెలంగాణ పోలీస్ సహకారంతో ఎన్‌ఐఏ పట్టుకుంది. ఉగ్రవాదం పెరగడానికి బీజేపీనే కారణం. మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తుంది. అభినందన్‌ను వదలకపోతే పాకిస్తాన్‌కు కాలరాత్రి అని ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు. భద్రత, ఉగ్రవాదం లాంటి అంశాలపై బాధ్యతతో మాట్లాడాలి. బీజేపీ నేతలు దద్దమ్మలు. దత్తాత్రేయ రిటైరై ఇంట్లో కూర్చోవాలి.
ప్రతి అంశాన్ని ఎంఐఎంతో ముడిపెట్టి మాట్లాడటం తగదు. బీజేపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడి పోలీసుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. ప్రతి అంశంలోనూ ఎంఐఎంను బూచిగా చూపుతున్నారు. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్, భట్టి విక్రమార్క పెద్ద మేధావుల్లా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ హయాంలో ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? దమ్ముంటే ప్రజాక్షేత్రంలో కొట్లాడండి. బ్యాలెట్ అయితే బాగుంటుందని మాట్లాడుతున్న ఉత్తమ్ ఈవీఎంలతో గెలవలేదా? ఫిరాయింపులపై కాంగ్రెస్ నేతలకు మాట్లాడే నైతిక హక్కు లేదు. కాంగ్రెస్ నేతలు వారి ఎమ్మెల్యేలను కాపాడుకుంటే చాలు. మా పాలన బాగుంటేనే ప్రజలు మాకు పట్టం కట్టారు. ఇంటర్ ఫలితాలపై ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. నివేదిక వచ్చాక ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మిషన్ భగీరథ నూటికి నూరు శాతం పూర్తయింది’అని తలసాని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment