
సాక్షి, హైదరాబాద్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఈనెల 30న సోనియాగాంధీని ఆహ్వానించి పెద్ద ఎత్తున బహిరంగసభను నిర్వహించడం ద్వారా ఎన్నికల కదనరంగంలోకి దూకేలా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రణాళిక సిద్ధం చేశారు. అదేరోజు గజ్వేల్‌తోపాటు ఉత్తమ్ సొంత జిల్లా కేంద్రమైన సూర్యాపేటలో కూడా బహిరంగ సభను నిర్వహించనున్నారు.
ఈ మేరకు ఈనెల 30న రాష్ట్రానికి రావాలని కోరుతూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా ద్వారా సమాచారమిచ్చారు. ఇందుకు సోనియా కూడా సమ్మతించినట్టు సమాచారం. దీంతో ఈనెల 30న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావ సభలను నిర్వహించడం దాదాపు ఖాయమైపోయింది. సోనియా వచ్చే విషయంలో మార్పు జరిగితే తప్ప ఈ షెడ్యూల్‌లో మార్పు ఉండే అవకాశం లేదని టీపీసీసీ నేతలు చెపుతున్నారు.
సోనియా సభల అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కూడా రాష్ట్రానికి తీసుకువచ్చి భారీ బహిరంగసభలు నిర్వహించాలని యోచిస్తోంది. రాష్ట్రంలో రాహుల్‌తో 10 సభలు నిర్వహించాలని, ఈసారి ఎన్నికలలో తెలంగాణకు ఎక్కువ సమయం కేటాయించాలని కూడా టీపీసీసీ ఇప్పటికే అధిష్టానాన్ని కోరింది. ఈ నేపథ్యంలో కనీసం ఉమ్మడి జిల్లాకో బహిరంగ సభను సోనియా లేదా రాహుల్‌లతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment