
సాక్షి,బెంగళూరు: కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో మామూలు షాక్ తగలలేదు. కేవలం ఒక్కటంటే ఒక్క ఎంపీ స్థానానికే పరిమితమై అందరినీ ఆశ్చర్యపరిచింది. కర్ణాటక చరిత్రలో ఇంత తక్కువ స్థాయి లో స్థానాలు దక్కించుకున్న సంఘటన మరొకటి లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా ఇంతటి హీన స్థితిలో ఓటమి పాలవడంపై కార్యకర్తలు ఆగ్రహావేశాలకులోనవుతున్నారు. 2009లో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాలు గెలుచుకోగలిగింది. కానీ ఈసారి ఆ భాగ్యం కూడా దక్కలేదు. దీంతో కేపీసీసీ ప్రధాన కార్యాలయం వెలవెలబోయింది.
20 సీట్లపై కన్ను?
జేడీఎస్‌తో కలిసి పోటీ చేసినా కాంగ్రెస్‌కు పరాభవం తప్పలేదు. 2004లో 8 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ఈ సారి కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. జేడీఎస్‌తో కలసి 18–20 సీట్లు గెలవాలని వేసుకున్న ప్రణాళికలన్నీ ప్లాఫ్ అయ్యాయి. 120 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో కేవలం ఒకే స్థానంలో గెలవడం ఇప్పటివరకు జరగలేదు. జేడీఎస్‌తో మైత్రి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగింది.
సిద్ధరామయ్య, దినేశా.. ఎవరిది బాధ్యత?
ఈ కాంగ్రెస్ ఘోర ఓటమికి కారణం ఎవరనే ప్రశ్న లు నేతలు, కార్యకర్తలు లేవనెత్తుతున్నారు. కాంగ్రెస్ ఓటమికి మాజీ సీఎం సిద్ధరామయ్య లేదా కేపీసీసీ అద్యక్షుడు దినేశ్ గుండూరావుల్లో ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. సిద్ధరామయ్య కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక దగ్గరి నుంచి జేడీఎస్ పార్టీకి ఏ స్థానాలు అప్పగించాలనే విషయం దాకా అన్ని ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని కార్యకర్తలు ఆరోపించారు. మైసూరుతో పాటు చాలా స్థానాల్లో తన సన్నిహితులకు టికెట్ రావడంలో కీలకపాత్ర పోషించిన సిద్దరామయ్య ప్రస్తుత వారి ఓటమికి బాధ్యత వహిస్తారా అనే ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. ఇక సిద్ధరామయ్య తాన అంటే తందానా అంటూ దినేశ్ గుండూరావు వ్యవహారించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ గెలవగలిగే కొన్ని చోట్ల జేడీఎస్‌కు అప్పగించడంపై బహిరంగంగానే వ్యతిరేకత వ్యక్తమయింది. నరేంద్రమోదీ దూకుడును అడ్డుకోవడానికి అధినేత రాహుల్ గాంధీ సైతం ప్రచారం చేసినప్పటికీ ఏమాత్రం ప్రభావం చూపించలేదు. కాంగ్రెస్ అధిష్టానం సూచనలతో జేడీఎస్‌తో స్నేహం చేసి పూర్తిగా విఫలం చెందారు. అంతర్గత లుకలుకలతో కాంగ్రెస్ అధినేతలు విఫలమయ్యారు. జేడీఎస్, కాంగ్రెస్ నేతలు పరస్పరం వ్యతిరేకంగా పనిచేయడం నష్టం కలిగించింది.
Comments
Please login to add a commentAdd a comment