సాక్షి, బెంగళూరు: జేడీఎస్‌తో మైత్రి వల్ల లాభం కంటే నష్టమే వచ్చిందని కాంగ్రెస్ అంతర్మథనంలో పడినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఎగ్జిట్ పోల్స్, నిఘా వర్గాలు వెల్లడించిన నేపథ్యంలో మైత్రిని వదులుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. జేడీఎస్‌తో కలసి ఎన్నికల్లో పోటీ చేస్తే గత లోకసభ ఎన్నికల్లో కంటే కూడా అధిక స్థానాలు గెలుచుకుంటామని బరిలో దిగగా, ఈసారి అంతకంటే తక్కువ స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చూసి హస్తవాసులు నిరాశలోకి కూరుకుపోయారు. జేడీఎస్‌తో పొత్తు వల్లే కాంగ్రెస్ బలం తగ్గిపోయిందని కొందరు నేతలు అనుమానిస్తున్నారు. పాత మైసూరు, కరావళి ప్రాంతాల్లో సంకీర్ణ కూటమి వల్ల కాంగ్రెస్ బలం బాగా తగ్గిపోయిందని పలువురు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఎమ్మెల్యేలకు సిద్ధు నిర్దేశం
ఎగ్జిట్ పోల్స్, నిఘా వర్గాల వివరాల మేరకు కాంగ్రెస్ పార్టీ గత సారి కంటే కూడా తక్కువ సీట్లు సాధించనుంది. దీంతో కొందరు సీనియర్ నేతలు దీనిపై విచారం వ్యక్తంచేసినట్లు సమచారం. స్వయంగా మాజీ సీఎం సి ద్ధరామయ్య కూడా తన అసంతృప్తిని కొందరు ఆప్తు ల వద్ద వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రస్తుత రాజకీ య అయోమయంలో కాంగ్రెస్‌పార్టీలోని అసంతృప్త ఎమ్మెల్యేలు తమ మార్గాన్ని తాము నిర్ధారించుకోవాలని సిద్ధరామయ్య సూచించినట్లు తెలుస్తోంది. పరోక్షంగా మైత్రి పక్షాన్ని వీడాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సిద్ధరామయ్య సూచించినట్లు తెలిసింది.
ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ నిర్లిప్త ధోరణి
మరోవైపు బీజేపీ గురువారం ఫలితాల తర్వాత పూర్తి స్థాయిలో ఆపరేషన్ కమలను నిర్వహించాలని పథకం వేస్తోంది. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి రిసార్టు రాజకీయాలకు తెరలేపడం లేదు. ఉద్ధేశపూర్వకంగానే జేడీఎస్‌తో మైత్రికి తెగదెంపులు చేసుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. రెండు రోజుల క్రితం రమేశ్ జారకిహోళి ఢిల్లీ పర్యటనను కూడా కాంగ్రెస్ పార్టీ తేలిగ్గా తీసుకుంది. దీంతో ఉద్ధేశపూర్వకంగానే కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మైత్రి వల్ల పాత మైసూరులో కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంకును కొద్దిగా కోల్పోవడం, కోలారు వంటి బలమైన మద్దతున్న చోట బీజేపీ గట్టి పోటీ ఇవ్వడం చూసి మైత్రి నుంచి బయటకు రాకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment