గిడ్డి ఈశ్వరి , వాసుపల్లి గణేష్‌కుమార్
టీడీపీ–కాంగ్రెస్ బంధం బలపడనుండడంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు కుదిరే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో ఇరు పార్టీలు మిగిలిన పార్టీలతో కలిసి మహాకూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఏపీలో జరుగనున్న ఎన్నికల్లో కూడా ఈ బంధం కొనసాగనుందని స్పష్టమవుతోంది. ఈ పొత్తు వల్ల తమ సీట్లకు ఎక్కడ ఎసరు వస్తుందోనన్న ఆందోళన అధికార టీడీపీ నేతల్లో మొదలైంది. కాంగ్రెస్‌లో ఆశావహులను సైతం ఇదే గుబులు వేధిస్తోంది.
సాక్షి, విశాఖపట్నం : రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదన్న ఆందోళనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అడ్డగోలు విభజనతో రాష్ట్రాన్ని ముంచేసిన కాంగ్రెస్‌తో జత కట్టింది. పార్టీ ఆవిర్భావం నుంచి బద్ధ శత్రువులుగా పోరాడుతున్న ఈ రెండు పక్షాలు ఇప్పుడు మిత్రపక్షాలుగా మారాయి. టీడీపీతో పొత్తు వల్ల కాంగ్రెస్ నేతలకు వచ్చిన నష్టమేమీ లేదు కానీ, కాంగ్రెస్‌తో పొత్తు వల్ల తమ ఆశలు ఎక్కడ గల్లంతవుతాయోనన్న ఆందోళన అప్పుడే ఒకరిద్దరు టీడీపీ సిట్టింగ్‌లు, పలువురు ఆశావహుల్లో మొదలైంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, పీసీసీ కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్‌లకు గడిచిన ఎన్నికల్లో విభజన పాపం వెంటాడడంతో కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. ఆ తర్వాత బాలరాజు పార్టీకి అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నా.. ద్రోణంరాజు మాత్రం అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్–టీడీపీ పొత్తు కారణంగా బాలరాజు పాడేరు, శ్రీనివాస్ విశాఖ దక్షిణం నుంచి బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు.
వాసుపల్లి సీటుకు ఎసరు..
పీసీసీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ద్రోణంరాజు శ్రీనివాస్ టీడీపీ నగర పార్టీ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సీటుకు ఎసరు పెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ స్థానం నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినందున శ్రీనివాస్ మళ్లీ ఇదే స్థానాన్ని కోరుకునే అవకాశాలున్నాయి. అదే కనుక జరిగితే వాసుపల్లి సీటు గల్లంతైనట్టే. అయితే గతంలో పొత్తు కారణంగా బీజేపీకి కేటాయించిన విశాఖ ఉత్తరం సీటును కాంగ్రెస్‌కు వదిలేస్తామన్న ప్రతిపాదన వచ్చినా ద్రోణంరాజుఆ స్థానం నుంచి పోటీకి ఆసక్తి చూపే అవకాశాల్లేవంటున్నారు. దీంతో కాంగ్రెస్ పొత్తుతో వాసుపల్లి సీటు గల్లంతయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదే కనుక జరిగితే విశాఖ ఉత్తరం నుంచి వాసుపల్లిని బరిలోకి దించే ఆలోచన పార్టీ అధినాయకత్వం చేస్తుందని భావిస్తున్నారు.
గిడ్డి ఆశలు గల్లంతైనట్టే..
టీడీపీలోకి ఫిరాయించిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. పార్టీ మారితే మంత్రి పదవి ఇస్తామన్నారని.. మంత్రివర్గ విస్తరణ ఆలస్యమైతే అప్పటి వరకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెడతారని, తనకు ఇక ఢోకా లేదన్న సాకుతో కన్నతల్లిలాంటి పార్టీనే కాదు ఓట్లేసి గెలిపించిన గిరిజనులను కూడా వెన్నుపోటు పొడిచి పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యే ఈశ్వరిలో కనీసం ఎమ్మెల్యే సీటైనా దక్కుతుందా.. లేదా ? అన్న ఆందోళన నెలకొంది. ఈ సీటు కోసం మాజీ మంత్రి మణికుమారితోపాటు మరికొందరు ఈశ్వరికి చెక్ పెట్టేందుకు యత్నిస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదిరే అవకాశాలుండడంతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్న మాజీ మంత్రి బాలరాజు కోసం పాడేరు స్థానాన్ని కాంగ్రెస్‌కు వదిలే అవకాశాలున్నాయని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. అదే కనుక జరిగితే ఆశావహుల మాట అటుంచితే.. ఎన్నో ఆశలతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి మళ్లీ పోటీ చేసే ఛాన్స్ దక్కే అవకాశాలు కనుచూపు మేరలో కన్పిం చడం లేదని స్పష్టమవుతోంది.
విశాఖ, అరకు పార్లమెంటు స్థానాల కోసం కాంగ్రెస్ పట్టు
గతంలో పోటీ చేసి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిథ్యం వహించిన రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి, కిశోర్ చంద్రదేవ్‌లు కాంగ్రెస్‌లోనే కొనసాగుతుండడంతో పొత్తులో భాగంగా విశాఖ, అరకు పార్లమెంటు సీట్ల కోసం కాంగ్రెస్ పట్టు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అరకు నుంచి టీడీపీకి బలమైన అభ్యర్థి లేకపోవడంతో ఆ స్థానాన్ని కాంగ్రెస్‌కు వదిలిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధినాయకత్వం కూడా ఈ స్థానం కోసమే ఎక్కువగా పట్టుపట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరోసారి పోటీ చేయాలని ఆశిస్తున్న సుబ్బిరామిరెడ్డి విశాఖ పార్లమెంటు సీటును కూడా కోరాలని అధినాయకత్వంపై ఒత్తిడి తీసుకువుచ్చేందుకు పావులు కదుపుతున్నారు. ఒకే జిల్లాలో రెండు స్థానాలు ఇచ్చే అవకాశం లేనందున అరకుకే పొత్తు ఖరారయ్యే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment