సాక్షి ప్రతినిధి ఖమ్మం: కాంగ్రెస్‌తో ఎన్నికల మైత్రి ఉంటుందనే ప్రచారం టీడీపీ వర్గాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఇప్పటివరకు తమ రాజకీయ భవిష్యత్ కోసం ఇతర పార్టీల ముఖ్య నేతలతో సహా ద్వితీయ శ్రేణి నాయకులు ఆసక్తి ప్రదర్శించినా.. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మూడేళ్లుగా జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో డీలాపడిన టీడీపీకి ఇక రాష్ట్రంలో జవసత్వాలు వచ్చే అవకాశం లేదని భావించిన జిల్లాకు చెందిన నేతలు అనేక మంది టీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపారు.
టీడీపీలోని కీలక నేతలు పలువురు ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారని, కొద్ది రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సైతం పార్టీ మారుతారని పెద్ద ఎత్తున అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. అయితే 2015లో సండ్రను తొలిసారిగా తెలంగాణ నుంచి ఏపీ ప్రభుత్వం టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించింది. రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగిన వెంకటవీరయ్యకు తాజాగా ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డులోనూ మరోసారి సభ్యుడిగా అవకాశం లభించింది. దీంతో ఆయన పార్టీ మారుతారన్న ఊహాగానాలకు తెరపడినట్లయింది.
టీడీపీలోనే కొనసాగుతూ ఎన్నికల నాటికి పార్టీ తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించాలని, కాంగ్రెస్‌తో పొత్తు ఖరారైతే టీడీపీలో సిట్టింగ్ స్థానాలను ఆ పార్టీ మళ్లీ కోరే అవకాశం ఉన్నందున తమ రాజకీయ భవిష్యత్‌కు ఎటువంటి ఇబ్బంది లేదన్న భావనతో పలువురు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొందరు టీడీపీ నేతల్లో మాత్రం కాంగ్రెస్‌తో మైత్రి సాధ్యమా..? ఒకవేళ ఉన్నా తమకు అవకాశం లభిస్తుందా..? ఎన్నికలకు ముందే పార్టీ మారితే కలిగే ప్రయోజనం ఎలా ఉంటుందన్న అంశాలపై తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం.
అంతరంగం వెల్లడించని ‘నామా’..
టీడీపీకి చెందిన మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు సైతం ఆ పార్టీని వీడి.. తన రాజకీయ భవిష్యత్ కోసం మరో పార్టీలో చేరుతారని, ఆయన కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యేందుకు అవకాశాలున్నాయని కొద్ది నెలలుగా జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు నామా తన అంతరంగం వెల్లడించకుండా పార్టీ కార్యకలాపాల్లో యథావిథిగా పాల్గొంటూ రాజకీయ పరిణామాలను సునిశితంగా పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. టీటీడీ బోర్డు సభ్యుడిగా నియామకమైన సండ్ర ప్రస్తుతం సత్తుపల్లి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లోనూ ఆయన సత్తుపల్లి నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో కాంగ్రెస్‌తో ఎన్నికల మైత్రి ఆయనకు కలిసొచ్చే అవకాశం ఉందని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. 2009, 2014 ఎన్నికల్లో వెంకటవీరయ్య టీడీపీ అభ్యర్థిగా సత్తుపల్లి నుంచి గెలుపొందగా.. 2004లో కాంగ్రెస్ నుంచి జలగం వెంకట్రావు, 1999, 1994లో టీడీపీ అభ్యర్థిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు.
2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో అప్పటివరకు ఎస్సీ నియోజకవర్గంగా ఉన్న పాలేరు జనరల్‌గా మారడం, జనరల్‌గా ఉన్న సత్తుపల్లి ఎస్సీగా మారడంతో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ సత్తుపల్లి నియోజకవర్గం నుంచి 2009, 2014లో పోటీ చేసి ఓటమి చెందారు. పాలేరులో తనకు మంచి అనుచరగణం, పూర్తిస్థాయి పట్టు ఉందన్న భావనతో ఉన్న సంభాని ఈసారి సత్తుపల్లి కన్నా.. పాలేరులో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
ఒకవేళ కాంగ్రెస్‌తో టీడీపీకి పొత్తు ఉంటే అక్కడ సిట్టింగ్ అభ్యర్థి అయిన వెంకటవీరయ్యకు ఆ పార్టీ మద్దతిచ్చే అవకాశం ఉంటుందని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పలుమార్లు విజయం సాధించడంతో నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ఓటు బ్యాంక్ ఉండటంతో ఆ పార్టీతో మైత్రి కుదిరితే టీడీపీకి ప్రయోజనమేనని ఆ పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక మాజీ ఎంపీ నామా సైతం పార్టీ మారడంకన్నా కాంగ్రెస్‌తో ఎన్నికల మైత్రి ఉంటే.. కాంగ్రెస్ పార్టీ తమకు సీటు కేటాయించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో బహిరంగంగానే ప్రచారం జరుగుతోంది.
ఇక ద్వితీయ శ్రేణి నేతలు పార్టీ మారినా ఇతర ప్రధాన రాజకీయ పక్షాల్లో తమకు సరైన ప్రా«ధాన్యం లభించే అవకాశం లేదని, టీఆర్‌ఎస్‌లో చేరిన అనేక మంది ద్వితీయ శ్రేణి నేతల్లో సైతం పార్టీ మారి సాధించింది ఏమీ లేదన్న భావన వ్యక్తం చేస్తున్న సమయంలో ఏ నిర్ణయం తీసుకోలేక పలువురు నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో రాష్ట్రంలో టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఆర్.కృష్ణయ్య, సండ్ర వెంకటవీరయ్య మాత్రమే ఆ పార్టీలో మిగిలారు.
సండ్రకు మరోసారి టీటీడీ బోర్డు సభ్యుడి పదవి అప్పగించడం ద్వారా పార్టీలో వెంకటవీరయ్యకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నామన్న సంకేతాలు పంపేందుకు, తద్వారా పార్టీలో వలసలను నివారించేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే జిల్లాలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన టీడీపీ ఇప్పుడు ఆ పార్టీ ప్రభ కొడిగట్టిన దీపంలా అవడంతో మండల, నియోజకవర్గ స్థాయి నేతలు ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment