ఆ పార్టీలు దీనిని బహిరంగంగా ప్రకటించాలి: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ–కాంగ్రెస్‌లు తమ మధ్య పొత్తు ఉందనే విషయాన్ని బహిరంగంగా ప్రకటించాలని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఆప్ లక్ష్యంగా ఈ రెండు పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్న వేళ కేజ్రీవాల్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. కొందరు మీడియా వ్యక్తులు మినహా మరెవరూ కాంగ్రెస్‌ను సీరియస్‌గా తీసుకోవడం మానేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీలు రెండు తెరవెనుక మైత్రిని సాగిస్తున్నాయని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆరోపించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలైన కాంగ్రెస్, ఆప్‌ల మధ్య హరియాణా అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తు పొసగలేదు.
అప్పటి నుంచి రెండు పార్టీల నేతలు కత్తులు దూసుకుంటున్నారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ కేజ్రీవాల్‌ను జాతి వ్యతిరేకి అంటూ విమర్శించడం..ప్రతిగా కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీని ఇండియా కూట మి నుంచి బయటకు పంపించేయాలని ఇతర పార్టీలను కోరుతాననే దాకా వెళ్లింది. శనివారం ఫిరోజ్‌షా మార్గంలోని తన నివాసం ఎదుట పంజాబ్‌కు చెందిన మహిళలు నిరసనకు దిగడంపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘వీరు పంజాబ్ మహిళలు కారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన వారు. పంజాబ్ మహిళలకు ఆప్‌పై నమ్మకముంది. వాళ్లు మమ్మల్ని విశ్వసించారు’అని చెప్పారు. బీజేపీకి ఒక ఎజెండా లేదు. ముఖ్యమంత్రి అభ్యర్థే లేరు. నాపై విమర్శలు చేయడం ద్వారానే బీజేపీ నేతలు ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు’ అని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment