విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీతక్క, గండ్ర జ్యోతి
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డిపై విజయలక్ష్మి అనే మహిళ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ మహిళ విభాగం ఖండించింది. దీనిపై సోమవారం వారు గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. గండ్రను రాజకీయంగా ఎదుర్కొలేక.. టీఆర్‌ఎస్ అతని వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. విజయలక్ష్మి అసత్య ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై తాము డీజీపీని కలువనున్నామని తెలిపారు. 2019లో గెలిచే అవకాశం ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్ టార్గెట్ చేసి రాజకీయంగా బలహీన పరచాలని చూస్తోందని ఆరోపించారు. నీచ రాజకీయాలకు మహిళలను వాడుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. టీఆర్‌ఎస్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలు మానుకోవాలన్నారు.
గండ్ర సతీమణి జ్యోతి మాట్లాడుతూ.. తన భర్తపై అసత్య ప్రచారం చేయడం ద్వారా ఆయన గెలుపు అవకాశాల్ని దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు. ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఆడంగి రాజకీయాలు చేయకుండా.. దమ్ముంటే ప్రజాక్షేత్రంలో ఎదుర్కొవాలని సవాలు విసిరారు. ఓ మాయ లేడీ మాటలు నమ్మి, మమల్ని నిందిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
లాయర్ సునీతా రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లోని గెలుపు గుర్రాలను అడ్డుకునేందుకే టీఆర్‌ఎస్ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. మంత్రివర్గంలో మహిళలకు చోటు కల్పించని టీఆర్‌ఎస్ వారిని ఇలాంటి వ్యవహారాల్లో వాడుకుంటుందన్నారు.
విజయలక్ష్మీపై కేసు నమోదు
తనపై విజయలక్ష్మీ చేసిన ఆరోపణలను గండ్ర ఖండించారు. ఆమె తనపై తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా, వేధింపులకు గురి చేస్తుందని గండ్ర పేర్కొన్నారు. దీనిపై ఆయన ఆదివారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. గండ్ర ఫిర్యాదు మేరకు పోలీసులు 384, 506 సెక్షన్‌ల కింద విజయలక్ష్మీపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment