
సాక్షి, విజయవాడ : ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యా విధానంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని బీసీ నేత ఆర్ కృష్ణయ్య స్వాగతించారు. సీఎం జగన్ నిర్ణయం పేద, బడుగు, బలహీన, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి, వారి బంగారు భవిష్యత్తు పునాది అవుతుందన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆధునిక కాలంలో ఏ చిన్న ఉద్యోగం కావాలన్నా ఈ రోజు ఆంగ్ల భాష పరిజ్ఞానం తప్పనిసరి అన్నారు. ఆంగ్లం చదవడం ద్వారా మంచి ఉద్యోగాలు వస్తాయన్నారు.
‘ఈ రోజుల్లో కూలీ పని చేసే వారు సైతం అప్పు చేసి మరీ వారి పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు. ప్రతి ఒక్కరు ప్రైవేట్ స్కూళ్ల వైపు వెళ్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయి. సీఎం జగన్ నిర్ణయంతో పేద పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. దీనిని రాజకీయం చేయడం సరికాదు. ఆంగ్ల విద్యా విధానం వచ్చినా అమ్మ భాష ఎక్కడికి పోదు’ అని కృష్ణయ్య అన్నారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50శాతం అవకాశం ఇవ్వడం శుభపరిణామం అన్నారు. నేడు సీఎం జగన్ బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యత ఇంతకు ముందు ఉన్న ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదని ప్రశంసించారు.