
ప్రజా పోరాటాలతో ఆదరణ పొందిన కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు ఉనికి కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాయి. ఒకప్పుడు వామపక్ష పార్టీలకు కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో సైతం ఇప్పుడు ప్రాభవం తగ్గిపోతోంది. బలమైన ఉద్యమాలు నిర్మించే స్థాయిలో నాయకత్వం గానీ, శ్రేణులు గానీ లేకపోవడం ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు శాపంగా పరిణమిస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కూడా సరైన రీతిలో ఉద్యమించలేకపోతున్నాయి. ముఖ్యంగా గతంలో ఓ వెలుగు వెలిగిన సీపీఎం ఇప్పుడు డీలాపడిపోయింది.
యాచారం/ఇబ్రహీంపట్నం రూరల్: నిరంతర ప్రజా పోరాటాలతో జిల్లాలో ఎర్రజెండా బలంగా పాతుకుపోయింది. అలుపెరగని ఉద్యమాలతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం సీపీఎంకు కం చుకోటగా మారగా.. సీపీఐ కూడా ఈ సెగ్మెంట్‌లో కొంతవరకు వేళ్లూనుకుంది. ఇబ్రహీంపట్నమే కాకుం డా మహేశ్వరం, కందుకూరు, బాలాపూర్, సరూర్‌నగర్, షాద్‌నగర్ మండలాల్లో కూడా లెఫ్ట్ పార్టీలకు కొంతవరకు పట్టుంది. ఈ క్రమంలో 2014 నాటివరకు సీపీఎం, సీపీఐలు సంస్థాగతంగా బలంగా ఉన్నా.. ఆ తర్వాత జరిగిన రాజకీయ సమీకరణలు ఇరుపార్టీల మనుగడను ప్రశ్నార్థకం చేశాయి. మూడు పర్యాయా లు ఇబ్రహీంపట్నం గడ్డపై ఎర్రజెండా ఎగురవేసి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన సీపీఎం అంతర్గత కుమ్ములాటలతో నిలువునా చీలిపోయింది. బలమైన నాయకులు పక్కపార్టీలోకి వెళ్లిపోగా.. కాస్తో కూస్తో మిగిలిన ద్వితీయశ్రేణి నాయకత్వం సీపీఐ గూటికి చేరింది. ఈ పరిణామంతో ఒకప్పుడు బలీయంగా ఉన్న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) డీలా పడింది. అదే క్రమంలో తెలంగాణ ఉద్యమం కూడా ఆ పార్టీని దెబ్బతీసింది. సమైక్య రాష్ట్రానికే ఆ పార్టీ ఓటేయడంతో ప్రత్యేక రాష్ట్రవాదుల్లో వ్యతిరేక ముద్రపడింది.
స్థానిక సమస్యలపై అవగాహన లేమి..
సీపీఎం పార్టీకి పూర్తికాలం కార్యకర్తలు ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర కమిటీలు ఇచ్చే పిలుపు మేరకు వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తప్ప.. స్థానిక సమస్యలపై పోరాడడం లేదు. భూ ఆక్రమణలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా ప్రజల మన్నన పొందలేకపోతున్నారు. మరోవైపు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి జిల్లాను నాలుగు ముక్కలు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో మళ్లీ జిల్లా కమిటీని ఎన్నుకోవాలని పార్టీ నాయకత్వం సూచిం చింది. ఎడాదైనా కమిటీ దిక్కులేదు. సీఐటీ యూ రాష్ట్ర కమిటీలో ఉన్న భూపాల్‌కు జిల్లా కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయం స్థానిక నాయకత్వంలో తీవ్ర అసంతృప్తికి తెరలేపింది. ఇబ్రహీంపట్నం మినహా యాచారం, మంచాల మండల కమిటీలు, జిల్లా నూతన కమిటీ ఎన్నుకోకపోవడం పార్టీ నేతల్లో నెలకొన్న అభిప్రాయ భేదాలే కారణంగా కనిపిస్తున్నాయి.
సీపీఐదీ అదేదారి..
సీపీఐకి ఇక్కడి నుంచి రాష్ట్ర నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కేవలం రెండు, మూడు గ్రామాలకే ఆ పార్టీ పరిమితమైంది. మాజీ ఎమ్మెల్యేకొండిగారి రాములు సీపీఎం నుంచి సీపీఐలో చేరడంతో ఆ పార్టీకి కలిసొచ్చింది. మరో మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహ కూడా సీపీఐ తీర్థం పుచ్చుకున్నప్పటికీ, తిరిగి ఇటీవల సొంతగూటికి చేరారు. అయితే, గతంలో సీపీఎంలో క్రియాశీలకంగా వ్యవహరించిన పార్టీ శ్రేణుల్లో అధికశాతం ఇప్పుడు సీపీఐ పంచన చేరడం గమనార్హం.
అలా ఎదిగి..ఇలా డీలా
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం సీపీఐ(ఎం)కు కంచుకోట. సీపీఐ(ఎం) నుంచి 1989 –1999 వరకు కొండిగారి రాములు(మంచాల), 2004 – 2009 వరకు మస్కు నర్సింహ(యాచారం) మూడు సార్లు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అప్పటి నియోజకవర్గంలో సీపీఐ(ఎం)కు మంచాల మండలంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, ఐదు మండలాల్లో 30 మందికి సర్పంచ్‌లు, 20 మందికి పైగా ఎంపీటీసీ సభ్యులు, 400 మందికి పైగా వార్డు సభ్యులు, గ్రామాల్లో గెలు పోటములను శాసించే పార్టీ శ్రేణులు ఉండేవారు. కాంగ్రెస్, టీడీపీలను ముప్పతిప్పలు పె ట్టే పార్టీ దళం ఉండేది. కానీ నేడు చూస్తే అన్ని మండలాల్లో ఒకరిద్దరు తప్పా ప్రజాప్రతినిధు లు లేని పరిస్థితి నెలకొంది. పోటీ చేసే నాయకులే లేకుండా పోయారు. కనీసం పార్టీ గ్రామ సభ లు, మండల మహాసభలు కూడా నిర్వహించలేని స్థితిలో పార్టీ ఉండడం గమనార్హం.
లుకలుకలే కారణమా?
ఇబ్రహీంపట్నం సెగ్మెంట్‌లో వామపక్షాలకు సమర్థ నాయకత్వం, కార్యకర్తల బలం పుష్కలంగా ఉన్నా మనుగడ సాధించకపోవడానికి గ్రూపు రాజకీయాలే కారణంగా కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో సీపీఎంలో నాయకుల మధ్య విభేదాలు తలెత్తాయి. పార్టీ టికెట్టు విషయంలో జంగారెడ్డి, యాదయ్య మధ్య గ్రూపు తగాదాలు మొదలయ్యాయి. పార్టీ శ్రేణులు కూడా రెండుగా చీలిపోవడంతో క్రమేణా నియోజకవర్గంలో సీపీఎం పట్టు కోల్పోయింది.