నిన్న విజయవాడ... ఇప్పుడు గన్నవరమా? | CPI angry over Pawan Kalyan denial of Vijayawada Lok Sabha seat | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 24 2019 2:47 PM | Last Updated on Sun, Mar 24 2019 7:01 PM

CPI angry over Pawan Kalyan denial of Vijayawada Lok Sabha seat  - Sakshi

సాక్షి, అమరావతి : జనసేన పార్టీతో సీట్ల సర్దుబాటు విషయంలో గందరగోళం నెలకొన్న విషయం వాస్తవమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి అంగీకరించారు. పొత్తుల్లో భాగంగా తమకు కేటాయించిన సీట్లలో పోటీ పెట్టారన్నారు. విజయవాడ పార్లమెంట్‌ నుంచి పోటీ చేయమని చెప్పిన, జనసేన ఇప్పుడు గన్నవరం అసెంబ్లీ ఇస్తామని అంటోందని ఆయన అన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రకటనలు ఎవరు చేసిన ఖండించాల్సిందేనని సురవరం పేర్కొన్నారు. కాగా తెలుగుదేశం పార్టీకి బీ టీమ్‌గా పనిచేస్తున‍్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సుదీర్ఘ చరిత్ర ఉన్న సీపీఐకి ఝలక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. సీట్ల సర్దుబాటులో భాగంగా సీపీఐకి ఇచ్చిన బెజవాడ లోక్‌సభ సీటును జనసేన లాగేసుకోవడంతో కూటమి నుంచి బయటకు రావాలని సీపీఐ భావిస్తోంది. 

కాగా విజయవాడ లోక్‌సభ సీటుకు సోమవారం నామినేషన్‌ వేసేందుకు సీపీఐ అభ్యర్థి చలసాని అజయ్‌ కుమార్‌ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జనసేన తన అభ్యర్థిగా ముత్తంశెట్టి కృష్ణబాబును నిన్నరాత్రి హడావుడిగా ప్రకటించింది. దీంతో కంగుతిన్న సీపీఐ నేతలు అత్యవసరంగా భేటీ అయ్యారు. కూటమి నుంచి బయటకు రావడమా? కొనసాగడమా? అనే దానిపై చర్చించారు. రాత్రి పొద్దుపోయే వరకూ ఈ సమావేశం కొనసాగినా దానిపై స్పష్టత రాలేదు. దీంతో సీపీఎం రంగంలోకి దిగి మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు సమాచారం. 

పొత్తులో భాగంగా జనసేన వామపక్ష పార్టీలకు చెరో 7 అసెంబ్లీ, రెండేసి పార్లమెంటు సీట్లు కేటాయించింది. ఇప్పటికే సీపీఐకి ఇచ్చిన అసెంబ్లీ సీట్లలో నూజివీడు సీటును జనసేన వెనక్కి తీసుకుని, దానికి ప్రత్యామ్నాయంగా విజయవాడ లోక్‌సభ సీటును కేటాయించింది. దీనికి అంగీకరించిన సీపీఐ తన అభ్యర్థిగా న్యాయవాది చలసాని అజయ్‌ కుమార్‌ను ప్రకటించింది. ఈ తరుణంలో జనసేన తన అభ్యర్థిని ప్రకటించడంపై అజయ్‌ను బలపరుస్తున్న పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. జనసేన వైఖరిపై గుర్రుగా ఉన్న సీపీఐ... ఆ పార్టీతో తెగదెంపులు చేసుకునే యోచనలో ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement