సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
సాక్షి, అమరావతి: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) అంటే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావడం లేదని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తెలిపారు. శుక్రవారం రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ..సీబీఐ రాష్ట్రంలోనికి రావద్దు అని అనడానికి చంద్రబాబుకు ఏం అధికారం ఉన్నదని ప్రశ్నించారు. సీబీఐ అనేది దేశ వ్యవస్థలో ఒక అంతర్భాగమన్నారు. విశాఖ మహా నగరంలో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడి చేసినా ఇంత వరకు దానిపై అతీగతి లేకుండా, సమగ్ర విచారణ జరపకుండా సీఎం చంద్రబాబు మెతక వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రలు పూర్తిగా క్షీణించాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి ఉన్నారని విమర్శించారు.
పార్టీ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు అదుపులో లేరని, చింతమనేని ప్రభాకర్ వ్యవహారమే ఇందుకు నిదర్శనమన్నారు. చింతమనేని ఇటీవల దళితులు, జర్నలిస్టులు, మహిళలపై దాడులు చేసినా ఇప్పటి వరకు చంద్రబాబు పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. డిసెంబర్ 18 నుంచి 21 వరకు సీపీఐ జాతీయ సమితి సమావేశాలు మహారాష్ట్ర మండలిలో జరుగుతాయని అన్నారు. విజయవాడలో ఈ నెల 20న రాష్ట్ర కార్యవర్గ సమావేశం భేటీ కానుందని, ఆ సమావేశంలో 2019 ఎన్నికలకు గానూ దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ప్రచార కార్యక్రమాలు చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment