సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా, విభజన హామీలపై సరైన పోరాటం చేయడంలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. గురువారం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అన్నీ రాజకీయ పార్టీలు ఏపీకి ప్రత్యేక హోదాపై మద్దతుగా నిలుస్తున్నా చంద్రబాబు ఎందుకు అఖిలపక్షం ఏర్పాటు చేయడం లేదో అర్థం కావటం లేదన్నారు. ఎన్డీఏలో ఉంటూ మోదీకి చంద్రబాబు భయపడుతున్నారని పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చాక బీజేపి ఒంటెద్దు పోకడకు పోతుందని.. సీబీఐ, ఐటీ అధికారులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని విమర్శించారు. ఈ విషయాలన్నింటినీ పవన్ కల్యాణ్‌తో చర్చించామని, ఈ నెల 19న విజయవాడలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి రావాల్సిందిగా కోరామని తెలిపారు. శుక్రవారం పాత్రికేయుల సమస్యలపై జరిగే ఆందోళనలకు సీపిఐ, జనసేన మద్దతు ప్రకటించిందన్నారు. అగ్రిగోల్డ్ బాధితలకు అండగా ఉంటామని పవన్ కల్యాణ్ తెలిపారని రామకృష్ణ వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నూతన రాజకీయాలు రావాలని కోరుకుంటున్నామన్నారు. అసెంబ్లీలో ధనవంతులు తిష్టవేస్తున్నారని, వారికి సామాన్యుడి కష్టాలు ఏం తెలుస్తాయని విమర్శించారు. సీపీఐ, సీపీఎంలు వేర్వేరు పార్టీలయినా ఉమ్మడిగా ఉద్యమం చేస్తున్నాయని రామకృష్ణ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment