సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. విశ్వవిద్యాలయాల్లో వైస్ చాన్సలర్ పోస్టులు భర్తీ చేయకుండా విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. రాష్ట్రం వ్యాప్తంగా 16 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఉన్న ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమేనని ఎద్దేవా చేశారు. బాబుకు ప్రైవేటు పిచ్చి పట్టుకుందని మండిపడ్డారు. ఆయన తీరు చూస్తుంటే ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటు పరం చేసేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబుకు పట్టం కడితే అదే జరగొచ్చని హెచ్చరించారు.
ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చడానికే ప్రైవేటు పాట పాడుతున్నారని అన్నారు. ‘రాష్ట్ర ప్రజానీకం ఓవైపు కరువుతో అల్లాడుతోంటే మంత్రివర్గంలో కనీస చర్చ పెట్టరు. కేంద్రంలో మోదీ.. రాష్ట్రంలో చంద్రబాబు ఇద్దరూ ప్రైవేటు వ్యక్తులకు ఊడిగం చేస్తున్నారు’ అని విమర్శించారు. కరువు మండలాల్లో రైతు రుణమాఫీ చేసి.. పంట నష్ట పరిహారం ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ నెల 27న రైతులకు ఆదుకోవడానికి ‘రైతుబంద్’కు పిలుపునిస్తున్నామని తెలిపారు. పార్లమెంట్‌లో రాష్ట్ర ఎంపీలు నిత్యం నిరసనలు చేస్తుంటే ప్రధాని కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎంపీలకు మద్దతుగా 3,4 తేదీల్లో ఢిల్లీలో ధర్నా కార్యక్రమం చేపడుతున్నామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment