సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విశిష్టతను, దాని ద్వారా సాధించుకున్న హక్కులు, గౌరవాన్ని తెలియజెప్పేందుకే రాష్ట్రవ్యాప్త స్ఫూర్తియాత్రను నిర్వహిస్తున్నట్టు సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. నాడు కమ్యూనిస్టులు జరిపిన ఈ చారిత్రక పోరాటాన్ని వక్రీకరిస్తూ, మతతత్వశక్తులు చేస్తున్న దు్రష్పచారాన్ని తిప్పికొట్టడంతో పాటు, ప్రజలను చైతన్యపరిచేందుకు ఈ యాత్రను చేపడుతున్నామన్నారు. బుధవారం ట్యాంక్‌బండ్‌పై ప్రముఖ కమ్యూనిస్టు నేత, తెలంగాణ పోరాటయోధుడు మఖ్దూం మొహియుద్దీన్ విగ్రహం వద్ద సాయుధపోరాట వారోత్సవాలు పురస్కరించుకుని సీపీఐ నగర కార్యదర్శి ఈటి నరసింహ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో స్ఫూర్తియాత్రను చాడ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయుధపోరాట స్ఫూర్తితో దేశంలో, రాష్ట్రంలో సాగుతున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాలని కేడర్‌కు పిలుపు నిచ్చారు. భారత్‌లో హైదరాబాద్ స్టేట్ విలీనం తర్వాత సర్దార్ పటేల్ సహకారంతో ప్రజల నుంచి దొరలు భూములను లాక్కున్నారని, కేంద్రానికి లొంగిపోయిన మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు గవర్నర్ పదవిని పటేల్ ఎందుకిచ్చారని ఆయన ప్రశ్నించారు. నిజాంపాలనలో రజాకార్ల అకృత్యాలపై తిరుగుబాటు చేసేందుకు కమ్యూనిస్టు నాయకులు రావి నారాయణరెడ్డి, మఖ్దూం మొహీయుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి సాయుధపోరాటానికి పిలుపునిస్తూ సంతకం చేశారని అజీజ్‌పాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్లా వెంకటరెడ్డి, వీఎస్ బోస్, ప్రేంపావని తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీపీఐ ఆధ్వర్యంలో చేపడుతున్న స్ఫూర్తియాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లాకు చేరుకుంది. సెప్టెంబర్ 17తో యాత్ర ముగుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment