సీతారాం ఏచూరి, బృందా కారత్ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వంపై భారత కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి, సెంట్రల్ పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ విరుచుకు పడ్డారు. నూతన అభివృద్ధి భారతాన్ని చూపుతామన్న మోదీ.. ఈ నాలుగేళ్లలో అసత్యాలు, దోపిడీల ప్రభుత్వాన్ని చూపిస్తున్నారని విమర్శల వర్షం గుప్పించారు. సీపీఐ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు.
మంచి రోజులు తెస్తామన్న మోదీ పాలనలో ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయని ఏచూరి ఆరోపించారు. వ్యవసాయంలో సంక్షోభం నెలకొనడంతో రైతు ఆత్మహత్యలు పెరిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోదీ యువతను మోసం చేశారని ధ్వజమెత్తారు. కేవలం 2.05 లక్షల ఉద్యోగాలిచ్చి చేతులు దులుపుకున్నారని ఆయన మండిపడ్డారు.
నోట్లరద్దు, జీఎస్టీతో అసంఘటిత రంగం కుదేలయిందని, ఈ సంస్కరణల వల్ల జీడీపీలో సగ భాగమైన చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయని అన్నారు. నిత్యావసర వస్తువులు, ముఖ్యంగా పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగాయనీ.. ప్రపంచంలో పెట్రోల్‌కు ఎక్కడా లేనంత అధిక ధర భారత దేశంలో ఉందన్నారు. మోదీ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని.. అందుకే ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓట్ల శాతం తగ్గిందని అభిప్రాయపడ్డారు.
దాడులు పెరిగాయి..
దళితులు, ఆదివాసీల అభివృద్ధికి పాటుపడతామని గొప్పలు చెప్పిన దేశ ప్రధాని చేసింది శూన్యమని బృందా కారత్ అన్నారు. ఎన్డీయే నాలుగేళ్ల పాలనలో వారిపై దాడులు పెరిగాయని ఆమె తెలిపారు. రిజర్వేషన్లను నీరుగార్చడంతో ఉన్నత విద్యాసంస్థల్లో దళిత, ఆదివాసీలు ఉద్యోగాలు పొందలేకపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాలలో వనరుల దోపిడీకి కార్పొరేట్లకు అన్ని అనుమతులు ఇస్తున్నారని బృందా కారత్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment