భారత్‌ తళతళలాడుతోందా? | Criticisms on Narendra Modi Swachch Bharath Abhiyan Scheme | Sakshi
Sakshi News home page

స్వచ్చంద మెంత?

Published Wed, Mar 27 2019 9:27 AM | Last Updated on Wed, Mar 27 2019 9:27 AM

Criticisms on Narendra Modi Swachch Bharath Abhiyan Scheme - Sakshi

నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమల్లోకి తీసుకువచ్చిన పథకం స్వచ్ఛ భారత్‌. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలకు చేరుతున్న తరుణంలో కూడా మారుమూల గ్రామాల్లో ప్రకృతి అవసరాల కోసం ప్రజలు బహిర్భూమికి వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. అత్యంత సున్నితమైన ఈ సమస్యని ఎవరూ బయటకు చెప్పుకోలేక నానా బాధలు పడేవారు. శుచి, శుభ్రత లేకపోవడంతో ప్రజలు తరచూ అనారోగ్యాల బారిన పడేవారు. ఈ సమస్యల పరిష్కారం కోసం మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని 2014 అక్టోబర్‌ 2న ప్రారంభించారు. తానే స్వయంగా చీపురు పట్టుకొని ఢిల్లీ రోడ్లు శుభ్రం చేశారు. 2019 అక్టోబర్‌ 2న గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని బహిరంగ మల విసర్జన రహిత దేశంగా మార్చి, తళతళలాడే అద్దం లాంటి భారత్‌ను గాంధీజీకి బహుమానంగా ఇస్తానని ప్రకటించారు. మరి ఈ అయిదేళ్లలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమం కేవలం ప్రచార ఆర్భాటంగా మాత్రమే మారిపోయిందా?

లక్ష్యాలను చేరుకుందా?
అయిదేళ్లలో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి సౌకర్యం ఉండేలా 12 కోట్ల టాయిలెట్ల నిర్మాణం జరపాలనేది స్వచ్ఛభారత్‌ లక్ష్యం. అంతేకాదు రోడ్లపై చెత్తా చెదారాన్ని పరిశుభ్రం చేసి వ్యర్థాల నిర్వహణలో కొత్త మార్గాల్లో వెళ్లాలని కూడా భావించింది. కానీ ఈ అయిదేళ్లలో టాయిలెట్ల నిర్మాణానికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. అనుకున్న లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించలేకపోయినప్పటికీ ఈ పథకం కొంతవరకైతే విజయం సాధించింది. ప్రజల భాగస్వామ్యం కూడా ఇందులో ఉండడంతో ఈ పథకానికి ఎక్కడ లేని క్రేజ్‌ వచ్చింది. అందులోనూ సినీతారలు కూడా పోటీ పడి చీపుర్లు పట్టుకొని రోడ్లు ఊడ్చి జనాల్లో స్ఫూర్తిని నింపారు.

స్వచ్ఛంద సంస్థల లెక్కలు ఇలా..
స్వచ్ఛభారత్‌ ప్రారంభించిన నాలుగేళ్లలో బహిరంగ మలవిసర్జన 26 శాతం తగ్గింది.
2014 నాటికి మరుగుదొడ్డి సౌకర్యం ఉన్న ఇళ్లు 37 శాతం మాత్రమే ఉంటే, 2018 నాటికి 71 శాతానికి చేరుకున్నాయి.
రైస్‌ అనే సంస్థ సర్వే ప్రకారం రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో ఇంట్లో టాయిలెట్‌ కట్టుకున్నప్పటికీ 23 శాతం మంది ప్రజలు బహిర్భూమికి వెళ్లే అలవాటును మానుకోలేకపోతున్నారు.
పబ్లిక్‌ టాయిలెట్లు కట్టేస్తే సరిపోదు. వాటి నిర్వహణ కూడా ముఖ్యమే. చాలా ప్రాంతాల్లో మరుగుదొడ్లకు నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో వాటిని వినియోగించలేక నిరుపయోగంగా ఉండిపోతున్నాయి.

బడ్జెట్‌పై విమర్శలు
ఒక మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలు అవుతుందని అంచనా. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.7,200 కేటాయిస్తే, మిగిలిన రూ.4,800 ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. అయితే టాయిలెట్ల నిర్మాణం, చెత్త సేకరణకు బడ్జెట్‌ కేటాయింపుల కంటే స్వచ్ఛ భారత్‌ పథకం ప్రచారానికే మోదీ సర్కార్‌ అత్యధికంగా నిధులు కేటాయిస్తోందనే విమర్శలున్నాయి. బహిరంగ మల విసర్జన చేయకూడదని, అది అనారోగ్యకరమని ప్రజల్లో అవగాహన పెంచాలంటే వారికి సమాచారం అందించడం, విద్యావకాశాలు కల్పించడం, కమ్యూనికేషన్‌ వ్యవస్థను పటిష్టం చేయడం (ఐటీసీ) వంటివి చేయాలని మోదీ సర్కార్‌ భావించింది. స్వచ్ఛభారత్‌ నిధుల్లో 8 శాతం వీటికే ఖర్చు చేయాలి. కానీ ఆ నిధులను ప్రభుత్వం ప్రచార ఆర్భాటానికే ఖర్చు చేసిందన్న విమర్శలున్నాయి. గత మూడేళ్లలో ఈ పథకం ప్రచారానికే రూ.530 కోట్లు ఖర్చు చేసిందని సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. 

2019, ఫిబ్రవరి 1 నాటికి సర్కార్‌ లెక్కలు
మొత్తం టాయిలెట్ల నిర్మాణం                                                   9.2 కోట్లు
బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలు                                      5.5 లక్షలు
బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు         28
టాయిలెట్‌ సౌకర్యం ఉన్న ఇళ్లు (గ్రామీణ ప్రాంతాల్లో)                       77 శాతం
ప్రతి రోజూ వాటినివినియోగించేవారు                                          93 శాతం
పట్టణ ప్రాంతాల్లోటాయిలెట్ల నిర్మాణ లక్ష్యం                                  67 లక్షలు
ప్రస్తుతం పూర్తయిన టాయిలెట్లు                                              60 లక్షలు
కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణం                                              4 లక్షలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement