న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ స్థానానికి మించి వీవీప్యాట్‌ల స్లిప్పులను లెక్కించే విషయంలో అభిప్రాయం తెలపాలని సోమవారం ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో మార్చి 28లోగా జవాబివ్వాలని తెలిపింది. ఓటర్ల సంతృప్తికోసం వీవీపాట్‌ల స్లిప్పుల లెక్కింపు కేంద్రాలను పెంచే యోచనపై ఎన్నికల సంఘం స్పందించాలని కోరింది. ఈ మేరకు ధర్మాసనం మార్చి 28, సాయంత్రం 4లోగా స్పందన తెలపాలని సూచించింది. ‘వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించే పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచాలని మేం ఆదేశిస్తున్నాం’ అని ధర్మాసనం అభిప్రాయపడింది.
‘తమను తాము మెరుగుపరుచుకునేందుకు ఏ వ్యవస్థ కూడా అతీతం కాదు. వ్యవస్థలో ప్రతీదీ మెరుగుపర్చుకోవడానికి ఒక విధానం ఉంది,‘ అని ధర్మాసనం పేర్కొంది. ఇది ఇప్పటికే ఉన్న వ్యవస్థపై అస్పష్టతగా భావించలేం.. కానీ ప్రామాణికతను మెరుగుపరిచేందుకు ఈసీకి అభ్యంతరం లేదని భావిస్తున్నాం’ అని స్పష్టం చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం యాభై శాతం పోలింగ్ మిషన్లలో వీవీప్యాట్‌ల స్లిప్పులను లెక్కించాలని దేశంలోని 21 ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును కోరిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment