
బాధ్యతలు స్వీకరించిన రాజాకు కేకు తినిపిస్తున్న సురవరం సుధాకర్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నూతన ప్రధాన కార్యదర్శిగా రాజ్యసభ సభ్యుడు డి.రాజా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయన నియామకాన్ని పార్టీ జాతీయ సమితి, కార్యవర్గ సమావేశం ఆమోదించింది. సుదీర్ఘకాలం ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సురవరం సుధాకర్‌రెడ్డి వయసురీత్యా వైదొలిగారు. గత మూడు రోజులుగా జరుగుతున్న జాతీయ సమితి, కార్యవర్గ సమావేశాల్లో సురవరం రాజీనామాను ఆమోదించారు. ప్రధాన కార్యదర్శి పదవి నుంచి వైదొలిగినా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతానని సురవరం తెలిపారు. రాజా నేతృత్వంలో పార్టీ పునర్నిర్మాణం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
విద్యార్థి సంఘం నాయకుడిగా..
తమిళనాడుకు చెందిన 70 ఏళ్ల డి. రాజా యువజన ఉద్యమాల ద్వారా క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. 1975–80 వరకు అఖిల భారత యువజన సమాఖ్య తమిళనాడు కార్యదర్శిగా, 1985–90 వరకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1994 నుంచి సీపీఐ జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2007 నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఆయన పదవీకాలం ఈనెల 24వ తేదీతో ముగియనుంది.ఎంపీగా రాజా దాదాపు అన్ని శాఖల పార్లమెంటు స్టాండింగ్ కమిటీల్లో పనిచేశారు.
జాతీయ కార్యవర్గంలోకి కన్హయ్య
జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నాయకుడు కన్హయ్య కుమార్‌ను జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. ఇటీవల మరణించిన షమీమ్‌ఫైజీ స్థానంలో కన్హయ్యకు చోటు కల్పించారు. ఒడిశాకు చెందిన రామకృష్ణ పాండ, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మనీష్ కుంజంను జాతీయ కార్యవర్గంలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఎన్నుకున్నారు. సమావేశాల్లో ఏపీ, తెలంగాణ కార్యదర్శులు రామకృష్ణ, చాడా వెంకట్‌రెడ్డి సహా ముప్పాళ్ల నాగేశ్వరరావు, శ్రీనివాస్‌రెడ్డి, అక్కినేని వనజా, ఓబులేసు పాల్గొన్నారు.