సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అంటే తెలంగాణ రౌడీల పార్టీ అని, తెలంగాణ ద్రోహుల అడ్డా అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముఖ్య అధికారప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ధ్వజమెత్తారు. తెలం గాణ అమరుల గురించి మాట్లాడే నైతిక అర్హత కేసీఆర్, కేటీఆర్ సహా టీఆర్‌ఎస్‌లో ఎవరికీ లేదన్నారు. అమరుల ఆత్మలు క్షోభించే విధంగా తెలంగాణ ద్రోహులను పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులతో అందలమెక్కించారని దుయ్యబట్టారు. మంగళవారం ఇక్కడి గాంధీభవన్‌లో ఆయన కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, మదన్‌మోహన్‌రావులతో కలసి విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మహత్యలే శరణ్యమనే విధంగా భావోద్వేగాలకు గురిచేసి ఆత్మ బలిదానాలకు కారకులైన హంతకులు టీఆర్‌ఎస్ నేతలని దుయ్యబట్టారు. సుమారు 1,500 మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే కనీసం 400 మంది అమరుల కుటుంబాలకు కూడా ఆర్థిక చేయూత అందించలేకపోయారని విమర్శించారు. టీఆర్‌ఎస్ జాతి, నీతి లేని పార్టీ అని ధ్వజమెత్తారు. ఏ అమరులు చెప్తే తెలంగాణ ద్రోహులు మహేందర్‌రెడ్డికి, తుమ్మల నాగేశ్వరరావులకు మంత్రి పదవులిచ్చారని ప్రశ్నించారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ అమరుల ఆత్మలు క్షోభిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్.. పొలిటికల్ శాడిస్ట్ అని, కేటీఆర్.. చార్లెస్ శోభరాజ్‌ను తలపిస్తున్నారని విమర్శిం చారు. టీఆర్‌ఎస్ పొత్తులు పెట్టుకుంటే నైతికం, కాంగ్రెస్ పొత్తులు పెట్టుకుంటే అనైతికమా? అని దాసోజు ప్రశ్నించారు. తమది ప్రజల కూటమి అని, టీఆర్‌ఎస్‌ది దొంగల కూటమి అని అన్నారు.
నోరుజారితే తరుముతాం: దయాకర్
కాంగ్రెస్‌పై కేసీఆర్, కేటీఆర్ నోరుజారితే వెంటపడి తరుముతామని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ హెచ్చరించారు. నోరు జారడం మీకే కాదు మాకు కూడా వచ్చన్నారు. తామిచ్చిన తెలంగాణను పాలిస్తూ, తామిచ్చిన మెట్రోను, ఇళ్లను ప్రారంభించి తానేదో సాధించినట్టు టీఆర్‌ఎస్ గొప్పలు చెప్పుకుం టోందని విమర్శించారు. దొంగల ముఠాకు నాయకుడు ప్రధాని మోదీ అయితే.. మోదీకి కేసీఆర్ ఏజెంట్ అని అభివర్ణించారు. ఉద్యమ సమయంలో చేపట్టిన సాగరహారంలో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు.
ఎవరి వీపు చింతపండు అవుతుందో
వచ్చే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారు: పొన్నం
సాక్షి, హైదరాబాద్: ఎవరి వీపు చింతపండు అవుతుందో వచ్చే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. వీపు చింతపండు అవుతుందనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ కుటుంబానికి వ్యక్తిత్వం లేదని, ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ కుటుంబానిదన్నారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్‌పై కేటీఆర్ అవాకులు, చవాకులు పేలుతున్నారని దుయ్యబట్టారు.
సిరిసిల్ల సభలో ఒక్క ఓటుతోనైనా తనను గెలిపించాలని కేటీఆర్ కోరింది కూడా ఆ భయంతోనేనని, ఓటమి భయం కేటీఆర్ మొహంలో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. మంగళవారం గాంధీభవన్‌లో పొన్నం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. సిరిసిల్ల నియోజకవర్గంలో జరగని అక్రమాలు లేవని, పైనుంచి కింద వరకు కమీషన్లు అందితేనే పనులు జరుగుతున్నాయని అక్కడి ప్రజలందరికీ తెలుసని చెప్పారు.
అక్కడ జరిగిన మరుగుదొడ్ల కుంభకోణం ఎక్కడా జరగలేదని, సిరిసిల్లలో ఏ వాగు చూసినా ఇసుక స్కామే కనిపిస్తుందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ గ్రామానికి వెళ్లి చూసినా స్థానిక సమస్యలు పరిష్కారం కాలేదని, డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించలేదని, రైతు బంధు విషయంలో విమర్శలున్నాయని చెప్పారు. తమ హయాంలో పింఛన్లు ఠంఛనుగా ఒకటో తేదీనే ఇచ్చేవారమని, ఇప్పుడు ఎప్పుడొస్తాయో తెలియక వృద్ధులు కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోందని దుయ్యబట్టారు.
ముందే కాడి ఎందుకు ఎత్తేశారో..!
మహాకూటమి ఫెయిల్యూర్ పేరని పొన్నం అభిప్రాయపడ్డారు. ‘కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు ఏర్పాటు చేస్తోంది మహాకూటమి కాదని, ప్రజా కూటమి’అన్నారు. ప్రజాకూటమికి ఎప్పుడూ ఓటమి ఉండదని చెప్పారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని అనే హక్కు కేటీఆర్‌కుగానీ, టీఆర్‌ఎస్‌కుగానీ లేదన్నారు. తెలంగాణ ఇచ్చాక కేసీఆర్ కుటుంబం సోనియాకు ధన్యవాదాలు చెప్పి కాళ్లు మొక్కి రాకపోతే ఆ హక్కు ఉండేదన్నారు.
తెలంగాణ ప్రజలకు పాలన చేతకాదని కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారని, తాము నంబర్ వన్‌గా పాలిస్తున్నామని పలుమార్లు చెప్పిన కేసీఆర్, 9 నెలల ముందే కాడి ఎందు కు ఎత్తేశారని ప్రశ్నించారు. ఉత్తర తెలంగాణలోనూ కాంగ్రెస్ బలంగా ఉందని, అక్కడ కూడా స్వీప్ చేస్తామని పొన్నం ధీమా వ్యక్తం చేశారు. తనకు కరీంనగర్ లోక్‌సభ నుంచి పోటీచేయడంపైనే ఆసక్తి ఉందని, కానీ పార్టీదే తుది నిర్ణయమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment