జగన్‌కు వినతి పత్రం అందజేసేందుకు వచ్చిన డీఎడ్ అభ్యర్థులు
తూర్పుగోదావరి : ప్రతి విద్యా సంవత్సరం నిర్వహించాల్సిన డీఎస్సీని ఏళ్ల తరబడి నిర్వహించకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని నెలకో టెట్ పెట్టడం తప్ప డీఎస్సీ నిర్వహించడం లేదని డీఎడ్ అభ్యర్థులు వైఎస్ జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా కాకినాడ రూరల్ చీడిగ వచ్చిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బి. సత్యనారాయణ శర్మ, ఎన్.శివ దుర్గాప్రసాద్, బి.మీనా, ఎం.శివ ప్రసాద్ తదితరులు కలిసి తమ గోడు వెళ్ల్లబోసుకున్నారు. రెండేళ్ల డీఎడ్ కోర్సులు పూర్తి చేసుకుని డీఎస్సీ కోసం ఎదరుచూస్తున్నామని, అయినా తమ సమస్యలు ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదని మా భవిష్యత్తు అంధకారంగా మారిందని వాపోయారు.
ఏడాదికి ఒకసారి నిర్వహించాల్సిన డీఎస్సీని నిర్వహించకుండా అర్హత పరీక్ష టెట్‌ను మాత్రం నెలకు ఒకటి నిర్వహిస్తూ విద్యార్థులను దోచుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు దఫాలు టెట్ నిర్వహించడం వల్ల అధికార పార్టీకి చెందిన కార్పొరేట్ సంస్థలు కోచింగ్‌ల పేరుతో రూ.లక్షలు దండుకుంటున్నారని వాపోయారు. గత ఏడాది నుంచి డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటిస్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రకటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీకి ముందు నిర్వహిస్తున్న టెట్ పరీక్షను రద్దు చేసి ఏపీపీఎస్సీ ద్వారా పరీక్ష నిర్వహించాలని వారు కోరారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యా బోధన చేయడానికి డీఎడ్ చేసిన అభ్యర్థులను మాత్రమే అనుమతించాలని వారితోనే ఎస్‌జీటీ పోస్టులు భర్తీ చేయాలని కోరారు.
పాఠశాలల్లో గుణాత్మక విద్యను బలోపేతం చేయడానికి ఏటా కేలండర్ ఇయర్ ప్రకటించి దాని ప్రకారం డీఎస్సీ నిర్వహించాలని వారు కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ, కళావిద్యను బోధించే ఉపాధ్యాయులను నియమించాలని, మూసేసిన అన్ని పాఠశాలలను తెరిపించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ వారిని అనుమతించడం వల్ల తాము నష్టపోతున్నామని వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా చర్యలు తీసుకుని, ఎస్‌జీటీ పోస్టులకు కేవలం డీఎడ్ అభ్యర్థులు మాత్రమే అర్హులుగా నిర్ణయించాలని వారు జగన్‌కు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment