సాక్షి ప్రతినిధి, కాకినాడ: జిల్లాలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సాగించిన 50 రోజుల సుదీర్ఘ పాదయాత్ర ఓ చారిత్రాత్మకం. 412 కిలోమీటర్లు సాగిన ఈ జన జాతరలో అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దాదాపు ప్రతిచోటా పాదయాత్ర తిరునాళ్లను తలపించింది. మార్తాండుడు చండ ప్రచండంగా విజృంభించినా... జడివానలు తడిపి ముద్ద చేసినా ఆయన అడుగు వెనుకకు వేయలేదు. జూన్ 12వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రోడ్డు కం రైల్వే వంతెన మీదుగా అశేష జనవాహిని మధ్య రాజమహేంద్రవరంలోకి ప్రజా సంకల్పయాత్ర ప్రవేశించింది. అఖండ గోదావరిపై చారిత్రాత్మకంగా నిలిచిపోయే విధంగా జననేతకు అపూర్వ స్వాగతం లభించింది. అక్కడి నుంచి కాటన్ బ్యారేజీ మీదుగా కోనసీమలోని పచ్చని పల్లెల్లోంచి మధ్య డెల్టా, మెట్ట ప్రాంతాల మధ్య పాదయాత్ర సాగించారు. ఏజెన్సీకి సమీపంలో ఉన్న జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో దుర్భేద్యమైన కొండల మధ్య కూడా పాదయాత్ర చేశారు. పాదయాత్ర పొడవునా జిల్లాలో చోటుచేసుకున్న ఆసక్తికర విషయాలిలా...
♦ జూన్13వ తేదీన 188వ రోజున పాదయాత్ర రాజమహేంద్రవరంలో మొదలై, కాటన్ బ్యారేజ్ మీదుగా బొబ్బర్లంక వద్ద కోనసీమలో కాలిడింది. అక్కడి నుంచి పేరవరం వరకూ యాత్ర వైఎస్సార్‌సీపీ పతాకంలోని మువ్వన్నెల్లా...మూడు పాయలుగా సాగింది. రేపటి సౌభాగ్యానికి భరోసానిస్తూ చిరునవ్వుతో నడుస్తుండగా, కుడివైపునున్న సెంట్రల్ డెల్టా ప్రధాన కాలువలో నవరత్న పథకాలను చాటే కటౌట్లతో నావలు మెల్ల మెల్లగా అనుసరించాయి. ఇక కాలువకు ఆవలి గట్టునా పోటెత్తిన ప్రజలు మూడో పాయగా ముందుకు సాగారు.
♦ జూన్ 26న బిందువు బిందువు కలిసి మహా సింధువైనట్టు ... జన కెరటాలు ఎగసిపడి జన ఉప్పెనలా రూపుదాల్చి ..కోనసీమ కేంద్రం అమలాపురాన్ని ముంచెత్తారు. ఇక్కడ 200వ రోజు పాదయాత్ర పూర్తి చేసుకుంది.
♦ జూన్ 21న రాజోలు నియోజకవర్గంలోని లక్కవరం క్రాస్ వద్దకు చేరుకోగానే 2400 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించారు. ఆ ఊరికి సమీపంలో కొబ్బరి మొక్కను నాటారు.
♦ రాజోలు మండలం చింతలపల్లిలో 13 జిల్లాల నుంచి తరలివచ్చిన ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ నిర్వహించిన ఒలంపిక్ రన్‌ను ప్రారంభించారు.
♦ జూలై 8వ తేదీన 208వ రోజుపాద యాత్ర జరిగిన పసలపూడి వద్ద 2500 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించారు. అదే రోజున వైఎస్సార్ జయంతి కావడంతో అభిమానుల మధ్య భారీ కేక్ కట్ చేశారు.
♦ జూలై 17వ తేదీన కొవ్వాడ రైల్వే ట్రాక్ వద్ద భారీగా ఏర్పాటు చేసిన కటౌట్ వద్ద కాకినాడ నియోజకవర్గ ప్రజలు స్వాగతం పలికి అభిమానం చూపించారు.
♦ జూలై 28న పాదయాత్ర సాగిన 100వ నియోజకవర్గంగా జగ్గంపేటలో అడుగు పెట్టారు. కేక్ కట్ చేశారు. 2600 కిలోమీటర్ల మైలు రాయిని జగ్గంపేటలో అధిగమించి గుర్తుగా మొక్కను నాటారు.
♦ జూన్ 29న కిర్లంపూడి మండలం వీరవరంలో బెల్లం తయారీని పరిశీలించారు. అక్కడ బెల్లం రుచి చూశారు.
♦ ఆగస్టు 1న గొల్లప్రోలులో సాగిన పాదయాత్రలో ప్రజలు
దారిపొడవునా పూలబాట పరిచారు.
♦ ఆగస్టు 7న చేనేత కార్మికుల దినోత్సవం పురస్కరించుకుని జనంతో మమేకమయ్యారు. శంఖవరంలో నాయీ బ్రాహ్మణులు కోరడంతో డోలు వాయించారు.
♦ ఆగస్టు 9న పారుపాక క్రాస్ వద్ద రోడ్డుపై చీరలు పరిచి స్వాగతం పలికారు. ఇక్కడ గిరిజనులు ఇచ్చిన విల్లును ఎక్కుపెట్టారు.
♦ ఆగస్టు 11న తునిలో 2700 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయిన సందర్భంగా మొక్కనాటి నీరు పోశారు. ఇదే రోజున తుని పాదయాత్రలో రోజా పూలతో అభిమానులు ముంచెత్తారు.
ఆ యాత్ర ... జన జాతర
Published Tue, Jan 8 2019 1:21 PM | Last Updated on Tue, Jan 8 2019 1:21 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment