విలేకరులతో మాట్లాడుతున్న నారాయణస్వామి
చిత్తూరు, పుత్తూరు: ‘‘అబద్ధాలతోనే ఇన్నేళ్లు రాజకీయాలు చేశారు.. ప్రజలు బుద్ధి చెప్పినా మీ తీరు మారడం లేదు.. ఈ జన్మకు మీరు మారరు’’ అని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి విరుచుకుపడ్డారు. గురువారం పుత్తూరులో విలేకరులతో మాట్లాడు తూ జీడీ నెల్లూరు మండలం నాగూరు పల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 951/4లో 83 సెంట్లు ప్రభుత్వ భూమిలో ఆ గ్రామస్తులు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వినియోగించుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ భూమిని గత ప్రభుత్వ హయాంలో అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త సుబ్రమణ్యంరెడ్డి భార్య ఢిల్లీరాణి పేరుతో డీకేటీ పట్టా పొందినట్లు చెప్పారు. దీనిపై హైకోర్టు, జేసీ కోర్టు పరిశీలించి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని తీర్పునిచ్చినట్లు వివరించారు.
ఇందుకు అనుగుణంగా రెవెన్యూశాఖ అన్యాక్రాంతమైన భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు సూచిక బోర్డును ఏర్పాటు చేసిందన్నారు. ఇటీవల ఢిల్లీరాణి కుటుంబసభ్యులు మృతిచెందితే శ్మశానంలో దహనక్రియలు జరపాల్సి ఉండగా, ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిలో ఖననం చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దీనిపై గ్రామంలో అలజడి చెలరేగితే రాజకీయ రంగు పులమడాన్ని ఆక్షేపించారు. ఈ విషయాన్ని రాజకీయం చేసేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నించడం దారుణమన్నారు. 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన వ్యక్తి కనీస అవగాహన లేకుండా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. జిల్లా అధికారులను విచారించి నిజాలు తెలుసుకుని మాట్లాడాల్సిన ప్రతిపక్ష నాయకుడు నానా యాగీ చేయడం చూస్తుంటే ప్రతి చిన్న విషయాన్ని రాజకీయాలు చేయాలనే తపన కనిపిస్తోందన్నారు. నిజానిజాలు ప్రజల మధ్యే తేల్చుతానన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే నాగూరుపల్లికి రావాలని సవాలు విసిరారు. విశాఖపట్టణంలో జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment