
సాక్షి, ఇడుపులపాయ: దేశంలో ప్రతిపక్ష సభ్యులతో నడుస్తున్న ఏకైక ప్రభుత్వం చంద్రబాబుదేనని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ ‘ప్రజా సంకల్పం’ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా ఇడుపులపాయలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... టీడీపీ పాలనలో ఏ చట్టాలను గౌరవించే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. 22 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకుని నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారని తెలిపారు. అప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని దుయ్యబట్టారు.
చంద్రబాబు సర్కారు 2 వేల జీవోలు రహస్యంగా విడుదల చేసిందని, ఎంత దొంగతనంగా ప్రభుత్వం నడుస్తుందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చని అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలను మాట్లడనీయకుండా గొంతు నొక్కుతున్నారని, ప్రజల తరపున ప్రశ్నించేందుకు అవకాశం ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు మధ్యకు వెళ్లడమే ఏకైక మార్గమన్నారు.
రాజ్యాంగ విరుద్ధమైన పరిపాలనను ప్రజల ముందు పెట్టడమే లక్ష్యంగా జగన్ పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. ప్రజాసామ్యాన్ని రక్షించడానికి, గాడి తప్పిన పాలనను దారిలో పెట్టడానికి జగన్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రజా సంకల్పం యాత్రలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వస్తున్న వైఎస్ జగన్‌ను గ్రామగ్రామన ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment