
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారీ ప్రజాదరణ మూటగట్టుకునేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రారంభించిన ‘దీదీ కే బోలో’కార్యక్రమానికి భారీ స్పందన వస్తోందని తృణమూల్ పార్టీ వర్గాలు తెలిపాయి. ‘సోమవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి రెండు రోజుల్లోనే 2 లక్షలకు పైగా ఫోన్ కాల్స్ వచ్చాయి. నిమిషానికి 170 ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మరో లక్ష మంది వారి అభిప్రాయాలను హెల్ప్‌లైన్ నెంబర్, వెబ్‌సైట్‌ల్లో పంచుకున్నారు. ఇంకా ఫోన్ కాల్స్‌ని లెక్కిస్తూనే ఉన్నాం. భారీ స్పందన లభిస్తోంది’అని వెల్లడించాయి.
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు చవిచూసిన మమతా బెనర్జీ తిరిగి ప్రజాదరణ సమకూర్చుకునే దిశగా ఓ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల సమస్యలు తెలుసుకుని, పరిష్కరించడానికి వెయ్యి మందికి పైగా పార్టీ నేతలు రానున్న 100 రోజుల్లో 10వేల గ్రామాల్లో పర్యటించాల్సి ఉంటుంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆలోచనగా ప్రారంభించిన ఈ భారీ ప్రజాదరణ కార్యక్రమం కోసం మమతా.. 9137091370 హెల్ప్‌లైన్ నెంబర్‌ను ఏర్పాటు చేశారు.