టీడీపీలో కొనసాగుతోన్న అసమ్మతి సెగలు | Sakshi
Sakshi News home page

టీడీపీలో కొనసాగుతోన్న అసమ్మతి సెగలు

Published Sun, Feb 17 2019 6:59 PM

Differences In YSR District TDP  - Sakshi

వైఎస్సార్‌ : జిల్లా టీడీపీలో అసమ్మతి సెగలు కొనసాగుతున్నాయి. టీడీపీలోని కాపు నాయకులు, మాజీ మంత్రి బ్రహ్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌ ప్రత్యేకంగా సమావేశమై అనంతరం విలేకరులతో మాట్లాడారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, జిల్లా మంత్రి ఆదినారాయణ రెడ్డి తీరుపై మండిపడ్డారు. జిల్లా టీడీపీలో ఒక కులానికి చెందిన నాయకులే ఆధిపత్యం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. గ్రూప్‌ రాజకీయాలను నాయకులు ప్రోత్సహిస్తున్నారని, ఏ రోజూ పార్టీకి పని చేయని వ్యక్తికి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఇవ్వడం బాధాకరమన్నారు.

సొంత పనులు చేసుకునేందుకు కొత్తగా పార్టీలోకి వస్తున్నారు తప్ప ప్రజలకు సేవ చేయడానికి కాదని వ్యాఖ్యానించారు. టీడీపీలో బలిజలకు ఒక న్యాయం..రెడ్లకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. తమను వాడుకుని వదిలేస్తున్నారని, మాకు ధైర్యం చెప్పే నాయకులే కరువు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడితే మాకు న్యాయం జరగకపోవడం దారుణమన్నారు. తెలుగుదేశం పార్టీలో మాలాంటి సీనియర్‌ నాయకులకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు.

ఒకరి నియోజకవర్గ పరిధిలో మరొకరు జోక్యం చేసుకుంటున్నారంటూ మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడిని ఉద్దేశించి నిరసన వ్యక్తం చేశారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు పదవులు ఎందుకు కట్టబెడుతున్నారని సూటిగా ప్రశ్నించారు. మా లాంటి సీనియర్లు ముఖ్యమంత్రికి కనబడటం లేదా.. మాకు న్యాయం చేయకపోతే ఇండిపెండెంటుగా పోటీ చేస్తామని హెచ్చరించారు.

Advertisement
Advertisement