brahmaiah
-
టీడీపీ సీనియర్ నేత హఠాన్మరణం
సాక్షి, కడప: టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పసుపులేటి బ్రహ్మయ్య హఠాన్మరణం చెందారు. బుధవారం తెల్లవారు జామున ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. బ్రహ్మయ్య మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. ఫిబ్రవరిలో కూడా గుండెపోటు రావడంతో విజయవాడలోని రమేష్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందారు. కాగా, బ్రహ్మయ్య కొంతకాలంగా రాజకీయంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరపున రాజంపేట అసెంబ్లీ సీటును ఆశించి భంగపడ్డారు. ‘పార్టీలో కష్టపడిన వారికి కాకుండా వలస వచ్చిన నేతలకే ప్రాధాన్యం ఇస్తున్నార’ని తన ఆవేదనను అప్పట్లో మీడియా ముందు వెళ్లబోసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బత్యాల చంగల్రాయుడు పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. వైఎస్సార్-కడప జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. -
టీడీపీ సీనియర్ నేతకు గుండెపోటు
సాక్షి, విజయవాడ : టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పసుపులేటి బ్రహ్మయ్య తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. మంగళవారం సీఎం అధ్యక్షతన జరిగే రాజంపేట పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన బ్రహ్మయ్యకు గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆయనను రమేష్ హాస్పిటల్‌కు తరలించారు. ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కాగా, బ్రహ్మయ్య కొంతకాలంగా రాజకీయంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. రాజంపేట అసెంబ్లీ సీటును ఆయన ఆశిస్తున్నారు. కాగా, బ్రహ్మయ్య అభ్యర్థనను చంద్రబాబు నిరాకరించినట్టు సమాచారం. నిన్న కడపలో జరిగిన మీడియా సమావేశంలో బ్రహ్మయ్య మాట్లాడుతూ.. ‘పార్టీలో కష్టపడిన వారికి కాకుండా వలస వచ్చిన నేతలకే ప్రాధాన్యం ఇస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. (టీడీపీలో కొనసాగుతోన్న అసమ్మతి సెగలు) -
టీడీపీలో కొనసాగుతోన్న అసమ్మతి సెగలు
వైఎస్సార్ : జిల్లా టీడీపీలో అసమ్మతి సెగలు కొనసాగుతున్నాయి. టీడీపీలోని కాపు నాయకులు, మాజీ మంత్రి బ్రహ్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ ప్రత్యేకంగా సమావేశమై అనంతరం విలేకరులతో మాట్లాడారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, జిల్లా మంత్రి ఆదినారాయణ రెడ్డి తీరుపై మండిపడ్డారు. జిల్లా టీడీపీలో ఒక కులానికి చెందిన నాయకులే ఆధిపత్యం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. గ్రూప్ రాజకీయాలను నాయకులు ప్రోత్సహిస్తున్నారని, ఏ రోజూ పార్టీకి పని చేయని వ్యక్తికి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఇవ్వడం బాధాకరమన్నారు. సొంత పనులు చేసుకునేందుకు కొత్తగా పార్టీలోకి వస్తున్నారు తప్ప ప్రజలకు సేవ చేయడానికి కాదని వ్యాఖ్యానించారు. టీడీపీలో బలిజలకు ఒక న్యాయం..రెడ్లకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. తమను వాడుకుని వదిలేస్తున్నారని, మాకు ధైర్యం చెప్పే నాయకులే కరువు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడితే మాకు న్యాయం జరగకపోవడం దారుణమన్నారు. తెలుగుదేశం పార్టీలో మాలాంటి సీనియర్ నాయకులకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. ఒకరి నియోజకవర్గ పరిధిలో మరొకరు జోక్యం చేసుకుంటున్నారంటూ మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడిని ఉద్దేశించి నిరసన వ్యక్తం చేశారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు పదవులు ఎందుకు కట్టబెడుతున్నారని సూటిగా ప్రశ్నించారు. మా లాంటి సీనియర్లు ముఖ్యమంత్రికి కనబడటం లేదా.. మాకు న్యాయం చేయకపోతే ఇండిపెండెంటుగా పోటీ చేస్తామని హెచ్చరించారు. -
ఉరవకొండ తహసీల్దార్‌పై బదిలీ వేటు
- కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్య నేపథ్యంలో ఉన్నతాధికారుల చర్య - నూతన తహసీల్దార్‌గా తిమ్మప్ప బాధ్యతల స్వీకరణ ఉరవకొండ : ఉరవకొండలో ‘పచ్చ బ్యాచ్’ దందాల నేపథ్యంలో తహసీల్దార్ బ్రహ్మయ్యపై బదిలీ వేటు పడింది. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. సోమందేపల్లి తహసీల్దార్ తిమ్మప్ప నాయుడును ఉరవకొండ తహసీల్దార్‌గా నియమించారు. ఆయన మంగళవారం బాధ్యతలు కూడా స్వీకరించారు. ఉరవకొండ మండలానికి చెందిన టీడీపీ మాజీ సర్పంచ్ గోవిందుతో పాటు మరికొందరు ఆ పార్టీ నాయకులు బ్యాచ్‌గా ఏర్పడి.. అధికారులు, సిబ్బందిని బెదిరించి ప్రభుత్వ, దేవాదాయ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తహసీల్దార్ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ రామలింగం ఆత్మహత్య నేపథ్యంలో ‘పచ్చ బ్యాచ్’ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై ఈ నెల 12న ‘సాక్షి’ దినపత్రికలో ‘రెచ్చిపోతున్న పచ్చబ్యాచ్’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. కలెక్టర్ కోన శశిధర్ వెంటనే స్పందించి విచారణకు ఆదేశించారు. అనంతపురం ఆర్డీఓ మలోలా, ఇతర అధికారులతో విచారణ కమిటీని నియమించారు. ఈ కమిటీ విచారణ నేపథ్యంలోనే తహసీల్దార్ బ్రహ్మయ్యపై బదిలీ వేటు పడింది. ‘పచ్చ బ్యాచ్’పై చర్యలు లేవా? ఉరవకొండలో పలు ప్రభుత్వ భూములతో పాటు దేవాదాయ ఆస్తులను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే కాకుండా కంప్యూటర్ ఆపరేటర్ మృతికి కారణమైన ‘పచ్చ బ్యాచ్’పై చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు సాహసించడం లేదు. తమ పార్టీకి చెందిన వారు అక్రమాలకు పాల్పడింది వాస్తవమేనని కొందరు టీడీపీ నాయకులు, కార్యకర్తలే చెబుతుండటం గమనార్హం. అయినప్పటికీ వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. పోలీసులు సైతం రామలింగం ఆత్మహత్య కేసులో తూతూమంత్రంగా విచారణ చేసి చేతులు దులిపేసుకున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. -
పసి ప్రాణంపై పైశాచికం
-
చిన్నారిని చిత్రహింసలు పెట్టిన సవతి తల్లి
దర్శి: మాట వినలేదని ఓ బాలుడిని సవతి తల్లి చిత్రహింసలకు గురిచేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా దర్శి మండలం శివరాజ్‌నగర్‌లో ఈ దారుణం జరిగింది. శివరాజ్‌నగర్‌కు చెందిన ఆంజనేయులు మొదటి భార్య చనిపోవడంతో లక్ష్మి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కొడుకు బ్రహ్మయ్య(4)ను పెంచడం ఇష్టం లేని లక్ష్మి అతడిని తరచూ కొడుతూ వేధిస్తుండడంతో ఆంజనేయులు అతడిని హాస్టల్లో ఉంచాడు. బాలుడు ఇటీవలే హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాడు. భార్యాభర్తల మధ్య జరిగిన ఓ గొడవ కారణంగా ఆ కోపాన్ని ఆమె బాలుడిపై చూపింది. మాట వినడంలేదంటూ బాలుడికి వాతలు పెట్టి తలపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. పైగా ఇంట్లో పెట్టి తాళం వేయడంతో బాలుడు రెండు రోజులుగా బయటకు రాలేదు. దీంతో గమనించిన స్థానికులు వారిపై ఒత్తిడి చేయడంతో అసలు విషయం తెలిసింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారమందించారు. భార్యాభర్తలు ఇద్దరు పరారయ్యారు. పసివాడిని చిత్రహింసలు పెట్టిన తల్లిని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
చిన్నారిని చిత్రహింసలు పెట్టిన సవతి తల్లి
-
ఇద్దరు కార్మికుల ఘర్షణ: ఒకరి మృతి
* మరొకరికి తీవ్రగాయాలు * పారతో మోది హత్య * పోలీసుల అదుపులో నిందితుడు ఇబ్రహీంపట్నం: ఇటుక బట్టీలో పనిచేసే ఇద్దరు కార్మికులు ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కర్ణంగూడ శివారులో ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన సుధాకర్ సాల్వే(38), ఒడిశా రాష్ట్రంలోని బాలంపేట్ జిల్లాకు చెందిన చైతన్య మండలంలోని కర్ణంగూడ సమీపంలోని మల్యాద్రికి చెందిన ఇటుక బట్టీలో పనిచేస్తున్నారు. చైతన్యకు వరసకు అన్న అయిన బెహురు ఇదే బట్టీలో పనిచేసేవాడు. అతడు గత బుధవారం స్వస్థలం ఒడిశాకు బయలుదేరాడు. అతను ఇంటికి చేరుకోకపోవడంతో కార్మికులకు హెడ్ అయిన సుధాకర్ సాల్వేను ఈవిషయమై రెండు రోజులుగా చైతన్య ప్రశ్నిస్తున్నాడు. ఈక్రమంలోనే ఆదివారం ఉదయం కూడా మరోమారు అడిగాడు. సుధాకర్ సాల్వే హేళన చేస్తూ సమాధానం చెప్పాడనే కక్షతో చైతన్య అతడిపై పిడిగుద్దులు కురిపించాడు. అనంతరం అక్కడే ఉన్న పారతో తలపై తీవ్రంగా మోదాడు. వీరిద్దరి గొడవ గమనించిన ఇటుక బట్టీ సూపర్వైజర్ బ్రహ్మనాయుడు వెళ్లడంతో చైతన్య అతడిపై కూడా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం ఓ గొడ్డలి తీసుకొని గదిలోకి వెళ్లి దాక్కున్నాడు. హత్య సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం చైతన్య వద్దకు వెళ్లగా అతడు వారిని బెదిరించాడు. బయటకు రాకుంటే కాల్చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో చైతన్య బయటకు వచ్చి లొంగిపోయాడు. తీవ్రంగా గాయపడిన సుధాకర్‌సాల్వేను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బ్రహ్మనాయకుడి తలకు గాయాలయవడంతో చికిత్స చేస్తున్నారు. హతుడు సుధాకర్ సాల్వే భార్య, ముగ్గురు పిల్లలు నాందేడ్‌లో ఉంటున్నారు. నిందితుడు చైతన్య భార్య ఒడిశాలో ఉంటుంది. ఈమేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జగదీశ్వర్ తెలిపారు. -
ఇటుకబట్టీ కార్మికుల మధ్య ఘర్షణ..ఒకరి మృతి
ఇబ్రహీంపట్నం మండలం కర్ణగూడెం వద్ద దారుణం చోటుచేసుకుంది. ఇటుకబట్టి కార్మికుల మధ్య ఓ విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసి ఒకరిని బలితీసుకుంది. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన సుధాకర్ అనే వ్యక్తి ఆసుపత్రిలో మృతిచెందగా..ఒడిషాకు చెందిన బ్రహ్మయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. -
పొగాకు మార్కెట్ పతనం
కొండపి: నిన్నమొన్నటి వరకూ పర్వాలేదు అనుకున్న పొగాకు మార్కెట్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఒక్క రోజులోనే కొండపి వేలం కేంద్రంలో కేజీకి రూ.10 పైగా ధర తగ్గింది. దీంతో రైతులు ఆందోళనకు దిగి వేలాన్ని అడ్డుకున్నారు. స్థానిక పొగాకు వేలంకేంద్ర అధికారి మురళీధర్ ఆధ్వర్యంలో ఉదయం తొమ్మిది గంటలకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మొదటగా 48 బేళ్లు కొనుగోలు చేశాక సరైన ధర రాలేదని పచ్చవ, కామేపల్లి గ్రామాలకు చెందిన రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వేలాన్ని అపాలని మురళీధర్‌ను కోరారు. దీంతో వేలాన్ని ఆపిన మురళీధర్ వ్యాపారులు, రైతులతో మాట్లాడి తిరిగి కొనుగోళ్లు ప్రారంభించారు. మరో ఆరు బేళ్లు కొనుగోలు చేసిన తరువాత ధరల విషయంలో మార్పు రాలేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. దీంతో అర్ధగంట పాటు అక్కడే రైతులు, వ్యాపారులు, అధికారుల మధ్య సంవాదం చోటుచేసుకుంది. శని, సోమవారాల్లో 80 శాతానికి పైగా నంబర్ పొగాకును క్వింటా రూ.11,500 నుంచి రూ.11,800 వరకు కొనుగోలు చేయగా, అదే రకం పొగాకును రెండు రోజులు తరువాత రూ.10,500 నుంచి రూ.11,000లోపే కొనుగోలు చేయటం ఏమిటని రైతులు ప్రశ్నించారు. వేలంకేంద్రం రైతు నాయకుడు బొడ్డపాటి బ్రహ్మయ్య మాట్లాడుతూ ఒక్కరోజులోనే వెయ్యి రూపాయలకు పైగా మార్కెట్ దిగకోస్తే ఎట్లా అని అధికారులను నిలదీశారు. దీనిపై ఆగ్రహించిన ఫీల్డ్ అసిస్టెంట్ మురళీ బ్రహ్మయ్యపైకి ఆవేశంగా వచ్చారు. దీంతో అక్కడే ఉన్న రైతులు బోర్డు అధికారి దుందుడుకు చర్యకు నిరసనగా ఆర్అండ్బీ రహదారిపై బైఠాయించారు. రైతు నాయకుడు బ్రహ్మయ్యపైకి క్షేత్రసహాయకుడు రావటం సరికాదని, వ్యాపారులు మాయాజాలంతో ధరలు తగ్గించి కొనటం అన్యాయం అని నినదించారు. అర్ధగంటకు పైగా రోడ్డుపై రాస్తారోకో నిర్వహించడంతో ఎక్కడి వాహనాలను అక్కడే ఆగిపోయాయి. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ ఆంజనేయులు సంఘటనా స్థలానికి వచ్చి రైతులు, బోర్డు అధికారులతో మాట్లాడి సంయమనంపాటించి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో రైతులు శాంతించి రాస్తారోకో విరమించారు. అనంతరం స్థానిక శాసనసభ్యులు ధరల విషయంపై వేలం కేంద్రానికి వచ్చి ఆరా తీశారు. రైతులకు న్యాయం చేసేలా చూడాలని వేలం కేంద్రం అధికారులను కోరారు.