ఇద్దరు కార్మికుల ఘర్షణ: ఒకరి మృతి
* మరొకరికి తీవ్రగాయాలు
* పారతో మోది హత్య
* పోలీసుల అదుపులో నిందితుడు
ఇబ్రహీంపట్నం: ఇటుక బట్టీలో పనిచేసే ఇద్దరు కార్మికులు ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కర్ణంగూడ శివారులో ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం..
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన సుధాకర్ సాల్వే(38), ఒడిశా రాష్ట్రంలోని బాలంపేట్ జిల్లాకు చెందిన చైతన్య మండలంలోని కర్ణంగూడ సమీపంలోని మల్యాద్రికి చెందిన ఇటుక బట్టీలో పనిచేస్తున్నారు. చైతన్యకు వరసకు అన్న అయిన బెహురు ఇదే బట్టీలో పనిచేసేవాడు. అతడు గత బుధవారం స్వస్థలం ఒడిశాకు బయలుదేరాడు. అతను ఇంటికి చేరుకోకపోవడంతో కార్మికులకు హెడ్ అయిన సుధాకర్ సాల్వేను ఈవిషయమై రెండు రోజులుగా చైతన్య ప్రశ్నిస్తున్నాడు.
ఈక్రమంలోనే ఆదివారం ఉదయం కూడా మరోమారు అడిగాడు. సుధాకర్ సాల్వే హేళన చేస్తూ సమాధానం చెప్పాడనే కక్షతో చైతన్య అతడిపై పిడిగుద్దులు కురిపించాడు. అనంతరం అక్కడే ఉన్న పారతో తలపై తీవ్రంగా మోదాడు. వీరిద్దరి గొడవ గమనించిన ఇటుక బట్టీ సూపర్‌వైజర్ బ్రహ్మనాయుడు వెళ్లడంతో చైతన్య అతడిపై కూడా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం ఓ గొడ్డలి తీసుకొని గదిలోకి వెళ్లి దాక్కున్నాడు.
హత్య సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం చైతన్య వద్దకు వెళ్లగా అతడు వారిని బెదిరించాడు. బయటకు రాకుంటే కాల్చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో చైతన్య బయటకు వచ్చి లొంగిపోయాడు. తీవ్రంగా గాయపడిన సుధాకర్‌సాల్వేను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బ్రహ్మనాయకుడి తలకు గాయాలయవడంతో చికిత్స చేస్తున్నారు. హతుడు సుధాకర్ సాల్వే భార్య, ముగ్గురు పిల్లలు నాందేడ్‌లో ఉంటున్నారు. నిందితుడు చైతన్య భార్య ఒడిశాలో ఉంటుంది. ఈమేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జగదీశ్వర్ తెలిపారు.