సాక్షి, భోపాల్ : మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ తన రెండో భార్య అమృత రాయ్‌తో కలిసి రాష్ట్రంలో చేపట్టిన 3,300 నర్మదా పరిక్రమ యాత్ర ఇటు రాజకీయ వర్గాల్లోనూ, అటు ప్రజల్లోనూ ఉత్కంఠ రేపుతోంది. రోజుకు పది, పన్నెండు కిలోమీటర్ల చొప్పున గ్రామీణ ప్రాంతాల గుండా ఆయన సాగిస్తున్న ఆయన యాత్ర ఇప్పటికీ దాదాపు రెండు నెలలు పూర్తి చేసుకొంది. మరో నాలుగు నెలలపాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆయన ప్రజలను, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రత్యక్షంగా కలుసుకొని వారితో ముచ్చటిస్తున్నారు.
110 అసెంబ్లీ నియోజక వర్గాల నుంచి కొనసాగనున్న ఆయన యాత్ర పట్ల పార్టీ సహచర నాయకులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వయస్సులో ఆయన ఇంత రిస్కు తీసుకొని ఎందుకు పాదయాత్ర జరుపుతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. ఆయన యాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి ఆయనకు పార్టీలో పోటీదారులైన కమల్‌నాథ్, జోతిరాధిత్య సింధియాలు కూడా ఆయన యాత్రలో పాల్గొనాల్సి వచ్చింది. వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో దిగ్విజయ్ యాత్రకు ప్రాధాన్యత చేకూరింది. 2003 నుంచి అధికారంలో ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని పడగొడతామని ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆశిస్తోంది.
2003లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీలో 228 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీకి కేవలం 38 సీట్లు రావడంతో ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్రంలో అన్ని పదవులకు దూరంగా ఉంటానని దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. పదేళ్లు ఎప్పుడో పూర్తయినప్పటికీ రాష్ట్రంలో ఎలాంటి పదవులు స్వీకరించేందుకు ఆయన అవకాశం రాలేదు. పైగా పార్టీ కేంద్ర స్థాయిలో ఉన్న పదవులు ఊడిపోయాయి. ముందుగా గోవా పార్టీ ఇన్‌చార్జి పదవిని పోగొట్టుకున్న ఆయన ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణలలో కూడా పదవులను కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లో పదవులకు దూరంగా ఉన్నప్పటికీ పార్టీలో తన పట్టును కోల్పోకుండా పావులు కదుపుతూ వస్తున్నారు. తన విధేయులకు పదవులు లభించేలా చూసుకుంటున్నారు. తన మాటను పార్టీ సీనియర్ నేతలు ఖాతర చేయకపోతే తన మాటను పట్టించుకోకపోతే ముందుముందు పశ్చాత్తాప పడాల్సి వస్తుందంటూ ఆయన తనదైన శైలిలో చెబుతూ వస్తున్నారు.
ఇప్పుడు యువజన నేతగా, భవిష్యత్ కాంగ్రెస్ సీఎంగా పార్టీలో జ్యోతిరాధిత్య నీరాజనాలు అందుకుంటున్న నేపథ్యంలోనే దిగ్విజయ్ ఈ సుదీర్ఘ యాత్రను చేపట్టారు. రాష్ట్రంలో పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలన్నా ముందుగా తనను పార్టీ అధిష్టానం సంప్రదించే పరిస్థితి ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. అన్నింటికి సమాధానం తిరిగి ప్రజల మన్ననలను కూడగట్టుకోవడమేనని ఆయన భావించారు. ఎన్నికల్లో ఘోర పరాజయంతో రాష్ట్ర ప్రజలకు దూరమైన ఆయన తనకంటే ఎంతో చిన్నదైన జర్నలిస్ట్‌ను రెండో భార్యగా చేసుకొని మరింత దూరమయ్యారు. తన కుమారుడైన ఎమ్మెల్యే జయవర్ధన్ సింగ్‌తోపాటు మాజీ ఎంపీ, తన సోదరుడు లక్ష్మణ్ సింగ్‌లు కూడా ఇదే అంశంపై దూరమయ్యారు. కొన్నేళ్ల తర్వాత వారు ఇప్పుడు దిగ్విజయ్‌ను పాదయాత్రలో వారు కలుసుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత పెళ్లేమిటని ఈసడించుకున్న ప్రజలే ఇప్పుడు ఆయన వెంట నడుస్తున్న అమృతరాయ్‌ను కూడా ఆదరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment