సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి అన్ని విధాల అండగా ఉంటున్న ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ మరోసారి నోరు జారడంపై వివాదం రగులుతోంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు అనాలోచితంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత సర్దుకోలేక సతమతమవడం మోహన్ భాగవత్‌కు మొదటి నుంచి అలవాటే. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా మోహన్ భాగవత్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడారు. బీసీలు ఎక్కువగా ఉన్న బీహార్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల బీసీలు దూరమయ్యారని, పర్వవసానంగా ఎన్నికల్లో గెలవాల్సింది, ఓడిపోయామని బీజేపీ వర్గాలు ఇప్పటికీ వాదిస్తాయి.
మొన్న ఆదివారం నాడు కూడా ఆయన ఓ సభలో మాట్లాడుతూ.. యుద్ధానికి సన్నద్ధం కావాలంటే భారత సైన్యానికి ఆరు నెలల కాలం పడుతుందని, అదే ఆరెస్సెస్‌కు మూడు రోజులు చాలని అన్నారు. కశ్మీర్ సరిహద్దుల్లో పాక్‌సైనికులు, టెర్రరిస్టులను తరచూ ఎదుర్కొంటూ భారత సైనికులు అసువులు భాస్తున్న సమయంలో మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు వారిని అవమానించేలా ఉన్నాయి.
జరిగిన నష్టాన్ని గ్రహించి తర్వాత ఆరెస్సెస్ ఆయన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది. మీడియానే ఆయన వ్యాఖ్యలను వక్రీకరించినట్లుగా పేర్కొంది. ‘భారత సైన్యాన్ని ఆయన అవమానపర్చలేదు. ఇతర భారతీయులకన్నా ఆరెస్సెస్ మంచి క్రమశిక్షణగల వారని చెప్పడమే ఆయన ఉద్దేశమని వివరణ ఇచ్చింది. ‘భారత రాజ్యాంగం అనుమతిస్తే పౌర సమాజాన్ని యుద్ధానికి సన్నద్ధం చేయడానికి సైన్యానికి ఆరు నెలలు పడుతుందని, అదే ఆరెస్సెస్ కార్యకర్తలు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తారు కనుక మూడు రోజుల్లోనే యుద్ధం చేయడానికి సిద్ధం అవుతారు’ అని మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారని ఆరెస్సెస్ నాయకుడు మన్మోహన్ వైద్య వివరణ ఇచ్చారు.
భారత సైన్యంతో ఆరెస్సెస్‌ను ఆయన పోల్చలేదని, సాధారణ పౌర సమాజంతో, ఆరెస్సెస్ కార్యకర్తలను పోల్చారని, ఇరువురికి శిక్షణ ఇవ్వాల్సింది సైన్యమేనని వైద్య చెప్పుకొచ్చారు. ఆయనే కాకుండా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజీజు, కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా కూడా వెనకా ముందు ఆలోచించకుండా మోహన్ భాగవత్ ‘అలా’ అనలేదంటూ వివరణలు ఇచ్చారు. మరి ‘ఎలా’ అన్నారో ఆయన ప్రసంగం వీడియో టేపును చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది కదా!
Comments
Please login to add a commentAdd a comment