అగ్గి రాజుకుంటున్నా అలసత్వం! | Dissatisfaction in congress party candettes | Sakshi

అగ్గి రాజుకుంటున్నా అలసత్వం!

Nov 15 2018 5:07 AM | Updated on Mar 18 2019 7:55 PM

Dissatisfaction in congress party candettes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీలో టికెట్‌ దక్కక అసంతృప్తితో రగిలిపోతున్న నేతలను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. పార్టీని నమ్ముకుంటే తీవ్ర అన్యాయం చేసిందని ఆశావహులు సెగలు కక్కుతున్నా వాటిని చల్లార్చే ప్రయత్నాలే కరువయ్యాయి. టికెట్ల ప్రకటనకు ముందు తూతూమంత్రంగా ఢిల్లీకి పిలిపించి మాట్లాడిన స్క్రీనింగ్‌ కమిటీ, ప్రకటన తర్వాత మాత్రం ఎవరి దారిన వారిని వదిలేశాయి. దీంతో ఆశావహులంతా కొందరు ఇండిపెండెంట్లుగా, కొందరు ఇతర పార్టీల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ, టీజేఎస్, సీపీఐలకు కేటాయించే స్థానాలపై ఒకింత స్పష్టత వచ్చినప్పటి నుంచే పార్టీలో అసంతృప్తి రాజుకుంది.

ముఖ్యంగా వరంగల్‌ వెస్ట్‌ టీడీపీకి కేటాయించనున్నారన్న సమాచారంతో టికెట్ల ప్రకటనకు మూడు రోజుల ముందునుంచీ అక్కడ టికెట్‌ ఆశిస్తున్న నాయిని రాజేందర్‌రెడ్డి వర్గీయులు డీసీసీ కార్యాలయంలో ఆందోళన నిర్వహిస్తున్నారు. వారిని ఏ ఒక్క నేత సముదాయించే ప్రయత్నం చేయలేదు. దీంతో మరింత ఆగ్రహావేశాలకు లోనయిన రాజేందర్‌రెడ్డి వర్గీయులు జిల్లా పర్యటనకు వచ్చిన మాజీ ఎంపీ వి.హనుమంతరావుపై తిరగబడ్డారు. సీనియర్‌ నేతను అవమానపరిచారని, కనీసం ఆందోళనలను పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ పార్టీ పెద్దలు స్పందించకపోవడంతో ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.

ఇక ఖానాపూర్‌ టికెట్‌ హరినాయక్‌కే కేటాయించాలని ఆ పార్టీ నేతలు మూడు రోజులు గాంధీభవన్‌లో నిరాహార దీక్షలకు దిగినా ఏ ఒక్క నేత కూడా వారి దీక్షలను ఉపసంహరించే ప్రయత్నం చేయకపోవడంపై వారంతా గుర్రుగా ఉన్నారు. ఇక మల్కాజ్‌గిరికి చెందిన నందికంటి శ్రీధర్‌ వర్గం ఆందోళనలతో హోరెత్తించినా వారిని పట్టించుకున్న నాథులే లేరు. శేరిలింగంపల్లిలో భిక్షపతియాదవ్, స్టేషన్‌ ఘన్‌పూర్‌లో విజయరామారావు, జూకల్‌లో అరుణతార, కంటోన్మెంట్‌లో క్రిశాంక్, బాన్సువాడలో మల్యాద్రిరెడ్డి, చొప్పదండిలో గజ్జెలకాంతం వంటి నేతల పరిస్థితి ఇలాగే ఉంది. వీరిని అటు పార్టీ అధిష్టానంకానీ, రాష్ట్ర పెద్దలుకానీ కనీసం పిలిచి మాట్లాడటంగానీ, బుజ్జగించే ప్రయత్నాలుగానీ చేయడం లేదు.

జిల్లా నుంచి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలు అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో వారు ఇండిపెండెంట్లుగా, రెబెల్స్‌గా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవారం ప్రకటించిన స్థానాల్లో ఎల్లారెడ్డి టికెట్‌ దక్కుతుందని ఆశించి భంగపడ్డ వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, ధర్మపురిలో కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు తమ భవిష్య త్‌ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితులు కాంగ్రెస్‌ పార్టీ గెలుపు అవకాశాలను తీవ్రంగా నష్టపరిచేవేనని స్పష్టంగా తెలుస్తున్నా పార్టీ పెద్దలు మాత్రం పట్టనట్లే వ్యవహరించడం కేడర్‌ను అయోమయానికి గురి చేస్తోంది. పార్టీ కోసం శ్రమించిన నేతలతో వెళ్లాలా? లేక పార్టీ నిర్ణయాల మేరకు నడుచుకోవాలా? అన్న అయోమయంలో పడ్డారు. ఈ నేపథ్యంలో నష్ట నివారణకు పార్టీ ఎలాంటి చర్యలు చేపడుతుందన్నది ఆసక్తిగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement