కుమార స్వామి- డీకే శివకుమార్ (ఫైల్ ఫొటో)
సాక్షి, బెంగళూరు : అనూహ్య నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్- జేడీఎస్ కూటమి కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. అయితే కాంగ్రెస్-జేడీఎస్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరకముందే.. అసమ్మతి వార్తలు ఆ రెండు పార్టీల్లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం జేడీఎస్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుపై విముఖంగా ఉందని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
నిన్న(సోమవారం) విలేకరులతో మాట్లాడిన శివకుమార్.. 1985 నుంచి పలు ఎన్నికల్లో గౌడ కుటుంబంపై పోటీ చేశానన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో దేవెగౌడపై పోటీ చేసి ఓడిపోయిన తాను.. ఆయన కొడుకు, కోడలుపై పోటీ చేసి గెలిచానన్నారు. రాజకీయ చదరంగంలో ఎన్నో ఎత్తుగడలను చిత్తు చేశానన్న శివకుమార్.. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయం మేరకే జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. పార్టీ, కన్నడ ప్రజల సంక్షేమం కోసం లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చామని పేర్కొన్నారు.
మరి జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం పట్ల మీరు సంతోషంగా ఉన్నారా అన్న ప్రశ్నకు బదులుగా.. అధిష్టానం కోసం చేదును మింగాల్సి వస్తోందని, అయినా వ్యక్తిగత అభిప్రాయాల కన్నా సమిష్టి నిర్ణయాలకే ఎక్కువ విలువ ఉంటుందని వ్యాఖ్యానించారు. అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహించడం తన కర్తవ్యమని శివకుమార్ తెలిపారు. అందుకే జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సమ్మతి తెలిపానని పేర్కొన్నారు.
కాలమే నిర్ణయిస్తుంది...
ఐదేళ్ల పాటు కాంగ్రెస్- జేడీఎస్ ప్రభుత్వం కొనసాగుతుందా అన్న ప్రశ్నకు బదులుగా.. ప్రస్తుతం ఆ విషయంపై తాను సమాధానం చెప్పలేనన్నారు. కాలమే అందుకు సమాధానం చెబుతుందంటూ వ్యాఖ్యానించారు. తమ ముందు ఎన్నో సవాళ్లున్నాయని పేర్కొన్న శివకుమార్... కేబినెట్ కూర్పుపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు జేడీఎస్ వంటి పార్టీతో కూటమి ఏర్పాటు చేయడం తమకు సానుకూల అంశంగానే ఉండబోతుందంటూ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment