సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అధికార పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు నానాటికీ ముదురుతోంది. విభేదాలు భగ్గుమంటున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తంటాలు పడుతున్నారు. కొద్దిరోజులుగా సర్దుబాటు యత్నాల్లో మునిగితేలుతున్నారు. కాంట్రాక్టులు, పైరవీలు, పనులు, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం టీడీపీ నాయకులు బహిరంగంగానే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఇటీవల ఎక్కువైంది. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో నాయకుల మధ్య గొడవలు తారస్థాయికి చేరడం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు, టీడీపీ నాయకులకు మధ్య సయోధ్య కుదరడం లేదు. ఈ నేపథ్యంలో నాయకుల మధ్య విభేదాలు పరిష్కరించడమే ధ్యేయంగా చంద్రబాబు వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొన్నటివరకూ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నాయకులతో భేటీలు నిర్వహించగా, కొద్దిరోజుల నుంచి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నాయకులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. గొడవ పడుతున్న నాయకులతో తొలుత పార్టీ ముఖ్యనేతలు మాట్లాడుతున్నారు. తర్వాత చంద్రబాబుకు వద్దకు పంపిస్తున్నారు. ఎలాగైనా తమ పంతమే నెగ్గాలని నేతలు పట్టుబడుతుండడంతో చంద్రబాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం, కలిసి పనిచేయాలని సూచించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.
ఫలితమివ్వని బాబు ‘క్లాసులు’
అనంతపురం జిల్లా నాయకులతో శుక్రవారం అమరావతిలో సమావేశం ఏర్పాటు చేయగా దానికి డుమ్మాకొట్టిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అదేరోజు కడపలో సీఎం రమేశ్ దీక్షా సభలో చంద్రబాబుకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, జేసీ వర్గాల మధ్య సయోధ్య కుదర్చడం అసాధ్యంగా మారింది. జేసీ నోరుతోపాటు ఆయన వర్గాన్ని కూడా చంద్రబాబు అదుపు చేయలేకపోతున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఆరు నెలలుగా ప్రయత్నిస్తున్నా మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గాల మధ్య విభేదాలను పరిష్కరించలేకపోతున్నారు. శనివారం కర్నూలు జిల్లా సమావేశం నిర్వహించిన చంద్రబాబు నాయకుల గొడవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి క్లాసు తీసుకోవడం మినహా ఏమీ చేయలేకపోయారు. ఆళ్లగడ్డలో మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి, కోడుమూరులో వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యే మణిగాంధీ, అక్కడి టీడీపీ ఇన్‌ఛార్జి విష్ణువర్దన్‌రెడ్డి, కర్నూలులో టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్‌వీ మోహన్‌రెడ్డి మధ్య విభేదాల తీవ్రతను తగ్గించలేకపోయారు. వైఎస్సార్ జిల్లాలో మంత్రి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి మధ్య రచ్చ ఇప్పటికీ రగులుతూనే ఉంది. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌పై మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఇటీవల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు మాత్రం సీఎం రమేశ్‌కే మద్దతు పలికారు. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వంటి నేతలు చంద్రబాబు తీరుపై అసంతృప్తితో ఉండడంతో వారిని బుజ్జగించేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు. నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి సర్దిచెప్పలేక చేతులెత్తేశారు.
కుదరని సయోధ్య
విశాఖ జిల్లాలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు మధ్య నాలుగేళ్లుగా సయోధ్య కుదరడం లేదు. ప్రస్తుతం గంటా తిరుగుబాటు ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. చంద్రబాబు పరోక్షంగా అయ్యన్నకు అండగా నిలుస్తూ గంటాను అణచి వేస్తున్నట్లు టీడీపీలో చర్చ నడుస్తోంది. ఇద్దరు మంత్రుల మధ్య గొడవ మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంపీలు మాగంటి బాబు, తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, పీతల సుజాత మధ్య పొసగడం లేదు. పార్టీ నాయకత్వానికి ఇది ఇబ్బందికరంగా మారింది. తూర్పు గోదావరి జిల్లాలో యనమల రామకృష్ణుడు, జ్యోతుల నెహ్రూ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు వేడి పెరుగుతున్న కొద్దీ నాయకుల మధ్య విభేదాలు పెరిగిపోతుండడం, ఫిరాయింపు ఎమ్మెల్యేలతో కొత్త సమస్యలు పుట్టుకొస్తుండడంతో ఏం చేయాలో తెలియక చంద్రబాబు సతమతమవుతున్నారు. వరుస సమావేశాలు నిర్వహిస్తూ హితబోధ చేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆయన తలపట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల్లో పర్యటించి నాయకుల మధ్య సయోధ్య కుదర్చాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. దగ్గరకు పిలిపించుకుని నచ్చజెబితేనే మాట వినని నాయకులు జిల్లాలకు వెళ్లి చెబితే వింటారా? అనే ప్రశ్నలు టీడీపీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
‘పచ్చ’ టీంలో రచ్చరచ్చ
Published Sun, Jun 24 2018 4:25 AM | Last Updated on Fri, Aug 10 2018 9:52 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment