
పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించిన టీడీపీ నేతలు, టీడీపీ నేతలపై లాఠీచార్జి చేస్తున్న పోలీసులు
వారిద్దరూ అధికార పార్టీకి చెందిన నేతలే.. ఒకరు మంత్రి..మరొకరు గత ఎన్నికల్లో టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి.. కానీ ఒకరంటే..మరొకరికి పడదు. దీంతో వారి అనుచరులూ రెండుగా చీలిపోయి ఆధిపత్యపోరు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసుల తీరును నిరసిస్తూ మంత్రి సునీత అనుచరులు పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగగా..పోలీసులు లాఠీలతో చితక్కొట్టారు.
తాడిపత్రి:టీడీపీకి చెందిన స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ తీరుపై ఇటీవల కొందరు కరపత్రాలు ముద్రించి పట్టణంలో పంచిపెట్టారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఎస్‌ఐ రాఘవరెడ్డి టీడీపీ సీనియర్ నేత, మాజీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హీరాపురం ఫయాజ్‌బాషాకు చెందిన డ్రైవరు మౌసిన్‌ను గురువారం అదుపులోకి తీసుకుని దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి పరిటాల సునీత వర్గీయులైన హీరాపురం ఫయాజ్‌బాషా, జగదీశ్వర్‌రెడ్డి, కాకర్ల రంగనాథ్‌లు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తమ అనుచరున్ని ఎందుకు అరెస్టు చేశారని పట్టణ సీఐ సురేందర్‌రెడ్డిని ప్రశ్నించారు. కరపత్రాలు పంపిణీ చేసి శాంతిభద్రతలకు విఘాతం కల్పించడం వల్లే అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. అయితే గతంలో తమపై కరపత్రాలు వేసిన వారిపై కేసులు నమోదు చేయాలని మంత్రి పరిటాల సునీత వర్గీయులు పట్టుబట్టారు.
దీంతో సీఐ సురేందర్‌రెడ్డి దురుసుగా ప్రవర్తించడంతో ఫయాజ్‌బాషా, జగదీశ్వర్‌రెడ్డి, కాకర్ల రంగనాథ్ తదితరులు పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు. సీఐ సురేందర్‌రెడ్డి వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు, టీడీపీ నేతలకు వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుతో మనస్తాపం చెందిన జగదీశ్వర్‌రెడ్డి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే లాఠీలకు పనిచెప్పిన పోలీసులు అక్కడున్న వారందరినీ తరిమికొట్టారు. అంతేకాకుండా స్టేషన్ సమీపంలో ఉన్న సామాన్యులపై కూడా లాఠీ ఝులిపించారు. స్టేషన్ ముందు బైఠాయించిన టీడీపీ నాయకులను ఈడ్చుకుని వెళ్లారు.
ఎమ్మెల్యే జేసీ ప్రోద్బలంతోనే
ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రోద్బలంతోనే తమపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని టీడీపీ సీనియర్ నాయకులు జగదీశ్వర్‌రెడ్డి, ఫయాజ్‌బాషా, కాకర్ల రంగనాథ్‌లు ఆరోపించారు. తాడిపత్రిలో పోలీసుల వల్లే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందన్నారు. కేవలం ఒక వర్గానికే వత్తాసు పలుకుతూ ప్రజలను భయభ్రాంతులను గురిచేస్తున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment