
వాషింగ్టన్: తన ఆరోగ్యంపై వదంతులు వస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం తన ట్విటర్‌లో ఒక అరుదైన ఫొటోను పోస్ట్ చేశారు. చొక్కా లేకుండా కండలు తిరిగిన బాక్సర్ దేహంతో ఫొటోషాప్ చేసిన తన ఫొటోను ఆయన పోస్ట్ చేశారు.
గత శనివారం ట్రంప్ ఆకస్మికంగా వాషింగ్టన్ బయట ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై మీడియాలో పలు కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై ఆగ్రహంతో ఉన్న ట్రంప్ తాను ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉన్నానని చాటేందుకు, వదంతులకు చెక్ పెట్టేందుకు ఈ ఫొటోషాప్ ఫొటోను ట్వీట్ చేసినట్టు భావిస్తున్నారు.
మంచి దిట్టమైన కండలతో కూడిన బాక్సర్ బాడీకి ట్రంప్ మొఖాన్ని సూపర్‌ఇంపోజ్ చేసి ఈ ఫొటోను రూపొందించారు. సిల్వెస్టర్ స్టాలోన్ సినిమా ‘రాకీ 3’ పోస్టర్‌లో వాడిన ఛాతిభాగాన్ని ఈ ఫొటోలో ఫొటోషాప్ కోసం వాడారు. ఈ కండులు తిరిగిన దేహంపై 73 ఏళ్ల ట్రంప్ ముఖాన్ని ఒకింత బ్యూటీఫై చేసి అటాచ్ చేశారు.
తన శారీరక దారుఢ్యం గురించి చెప్పేందుకు ట్రంప్ ఏనాడూ సిగ్గుపడింది లేదు. ఇతర వ్యక్తుల శారీరక ఆకృతి గురించి పొగుడుతూనే, వ్యంగ్యంగానే ఆయన అధికారిక కార్యక్రమాల్లో వ్యాఖ్యలు చేసేవారు. గత మంగళవారం ఫ్లోరిడాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ.. మీడియా తీరుపై మండిపడ్డారు. తనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో వాల్టర్ రీడ్ మిలిటరీ ఆస్పత్రికి తీసుకెళ్లారంటూ ప్రధాన మీడియా సంస్థలు తప్పుడు కథనాలు ప్రచురించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment